దైవసంకల్పం తల్లీ తనయుల శృంగార రతి కేళి Part 6

దైవసంకల్పం తల్లీ తనయుల శృంగార రతి కేళి Part 6

జ్యోత్స్న యనగా వెన్నెల. ఆవెన్నెలలో చరించు అభిసారికలు జ్యోత్స్నాభిసారికలు. తెల్లని మల్లెదండలు తలనిండ ధరించి, తనువు నిండ తెల్లని చందనము నలందికొని, తెల్లని పట్టువలిపెమును గట్టుకొని, వెన్నెలకంటె వేఱుగా గుర్తింపరాని యట్లు వారు వేషధారణ చేసికొని చరించుచున్నా రని పై శ్లోకమున కర్థము. మేఘసందేశములోని ఈక్రింది శ్లోకములోను చక్కని జ్యోత్స్నాభిసారికావేషవర్ణన మున్నది.

గత్యుత్కమ్పా దలకపతితై ర్యత్ర మన్దారపుష్పైః|
పత్త్రచ్ఛేదైః, కనకకమలైః కర్ణవిభ్రంశిభి శ్చ||
ముక్తాజాలైః, స్తనపరిసరచ్ఛన్నసూత్రై శ్చ హారైః|
నైశో మార్గః సవితురుదయే సూచ్యతే కామినీనామ్||

దీనికి నా యనువాదము:

చ. అలకలనుండి జారి పడినట్టి సురద్రుమసూనముల్, శ్రవ
స్ఖలితసువర్ణపద్మములు, సంశ్లథపత్త్రకఖండముల్, గుచాం
చలబహుకర్షణత్రుటితసర్జువులున్, గతికంపితాంగులై
యిల నభిసారికల్నిశల నేఁగినజాడలఁ జూపు వేకువన్.

అర్థము: గత్యుత్కమ్పాత్= మిక్కిలి ఉత్కంఠతో గూడిన గమనమునందలి చలనమువలన, అలకపతితైః మన్దారపుష్పైః =ముంగురులనుండి జారిపడిన మందారపుష్పములచేతను (మందారము దేవతావృక్షము. దీని పూవులు తెల్లనివి), పత్రచ్ఛేదైః=(చెక్కిళులనుండి తొలగిన) మకరికాపత్త్రముల ఖండములచేతను, కర్ణవిభ్రంశిభిః=చెవులనుండి పడిపోయినవైన, కనకకమలై శ్చ= బంగారుకమలములచేతను(యక్షస్త్రీలు దేవయోను లగుటచే వారు స్వర్గంగలో విరిసిన బంగారుకమలములను కర్ణాభరణములుగా ధరింతురు), ముక్తాజాలైః= (తలనుండి పడి పోయిన) ముత్తెపుసరులచేతను, స్తనపరిసర = స్తనపరిసరములందు, ఛన్నసూత్రైః= తెగిన అంతస్సూత్రములుగల , హారై శ్చ=మెడలోని హారములచేతను (కఠినమైన స్తనముల రాపిడిచేత హారములలోని దారములు తెగుటచే క్రిందపడిన హారముల శకలములచేత ననుట), కామినీనాం= మదనాతురలైన (అభిసారికా)స్త్రీలయొక్క, నైశో మార్గః=(ప్రియుల గవయుటకై పోయిన) రాత్రియందలి మార్గము, యత్ర=ఏ అలకాపురియందు, సవితురుదయే =సూర్యోదయకాలమునందు, సూచ్యతే=సూచింపబడుచున్నదో.

అలకాపురమున జ్యోత్నాభిసారికలు వెన్నెల కర్హమైన వేషములు ధరించి రయభయములతో గూడిన గమనోత్కంపముతో జనగా వారు ధరించిన తెల్లని మందారపుష్పములు, బంగారు కమలముల కర్ణావతంసములు, ముత్యముల దండలు, లోదారము తెగుటచే నేలపై బడిన స్తన ప్రాంతమునందలి ముత్యాలహారఖండములు వారేగుదారిలో పడిపోయినవి. అవి వేకువను జూచువారికి వారేగిన దారుల జాడలను తెల్పు చున్నవి. ఈశ్లోకములో వెన్నెలలో కలసిపోవునట్లు అభిసారికలు ధరించిన తెల్లని యలంకారము లన్నియు తెల్పబడినవి.

ఇట్లే తమిస్రాభిసారిక చీకటిలో కలసిపోవునట్లు నల్లని వస్త్రములు, నల్లని భూషణములు ధరించును. కావ్యములలో తమిస్రాభిసారికల వర్ణనలు బహుళముగా నున్నవి. చీకటిలోనే వీరి ప్రణయప్రయాణము. రసమంజరిలోని ఈక్రిందిశ్లోకము వీరి స్వభావమును చక్కగా సమీక్షించుచున్నది.

నామ్బుజైర్న కుముదై రుపమేయం,స్త్వైరిణీజనవిలోచనయుగ్మమ్|
నోదయే దినకరస్య నవేందోః, కేవలే తమసి తస్య వికాసః||

దీనికి నా యనువాదము:

తే. పద్మకైరవంబులను బోల్పంగఁ దగదు
స్త్వైరిణీజనలోచనద్వయముతోడ
తరణిచంద్రులు విరియింపఁ దగరు వాని,
వాని విరియింపఁ జాలును ధ్వాంతమొకటె.

పద్మములను సూర్యుడు, కలువలను చంద్రుడు వికసింపజేయు ననుట, కన్నులను పద్మములతో, కలువలతో బోల్చుట కవుల సంప్రదాయము. కాని స్త్వైరిణీస్త్రీల (తమోభిసారికల) కనులను మాత్రమట్లు బోల్పరాదు. ఏలనన, వాని వికాసము సూర్యుడు గల పగటియందును, చంద్రుడు గల రాత్రియందును గలుగదు. వాని వికాసము సూర్యచంద్రులు లేని చీకటిరాత్రులందే కలుగును.

అట్టి తమిస్రాభిసారికల నల్లనైన వేషధారణమును జయదేవుని గీతగోవిందమునందలి యీక్రింది శ్లోకము రమ్యముగా వర్ణించుచున్నది.

అక్ష్ణో ర్నిక్షిపదంజనం, శ్రవణయో స్తాపింఛగుచ్ఛావలీం,
మూర్ధ్ని శ్యామసరోజదామ, కుచయోః కస్తూరికాపత్త్రకం,
ధూర్తానా మభిసారసంభ్రమజుషాం విష్వఙ్నికుంజే సఖి!
ధ్వాతం నీలనిచోళచారు సుదృశాం ప్రత్యంగ మాలింగతి||

దీనికి నా భావానువాదము:

మ. తలలో నల్లనికల్వలున్, శ్రవములం దాపింఛగుచ్ఛంబు, ల
క్షులకుం గాటుకయుం, గుచస్థలులఁ గస్తూరీలసత్పత్త్రకం
బులు గైసేసి తమోఽభిసారికలకున్ బూర్ణాంధకారంబు, వా
రల ప్రత్యంగము నంటు కార్ముసుఁగు లీలం గ్రమ్మి, కుంజంబులన్.

తాత్పర్యము: జయదేవు డీశ్లోకములో ధ్వాంతమును (గాఢాంధకారమును) కర్తగా గొని, అతడు చేయు కార్యములను చెప్పుచున్నాడు. ఆ యంధకారములో అభిసారసంభ్రమముతో ధూర్తస్త్రీలు నికుంజసంకేతములకు జేరినారు. ఆస్త్రీల కన్నులకు నల్లనికాటుకను, శ్రవణములకు నల్లకానుగుపూలమొత్తమును, తలలకు నల్లగల్వలను, స్తనములకు కస్తూరి పత్త్రభంగములను అతడు గైసేసినాడు (అట్టి నల్లని వేషములను ధరించి వారలు వచ్చినారనుట). చీకటినే వారికి నల్లని ముసుగుగా వేసి, వారి సమస్తాంగముల నతడు సంశ్లేష మొనరించినాడు. ముసుగు నిండుగా గప్పికొన్నప్పు డది సమస్తాంగములను ఆవరించుట సహజమే కదా! ఇట్లావరించుటనే జయదేవుడు సకలాంగసంశ్లేషముగా నుత్ప్రేక్షించినాడు. తమిస్రాభిసారికలు ధరించు శ్యామలాహార్యమును వర్ణించుట ఈశ్లోకముయొక్క ప్రధానాశయము. సమాసోక్తివలన నిచ్చట ననేకనాయికల గైసేసి కౌఁగిలించుకొనుచున్న దక్షిణనాయకుని వృత్తాంతము సైతము స్ఫురించుచున్నది.

ఇట్లు చీకటిలో నభిసరించునప్పుడు మదనాతురైకమతులైన వారు దారియందలి సర్పవర్షకంటకాదిభయములను లెక్క సేయరని కవులు వర్ణింతురు. అమరుకములోని ఈక్రింది శ్లోకము ప్రశ్నోత్తరరూపములో నిట్టి మదనాతురతను ధ్వనించుచున్నది.

క్వ ప్రస్థితాసి కరభోరు! ఘనే నిశీథే?
ప్రాణాధికో వసతి యత్ర జనః ప్రియో మే!
ఏకాకినీ బత కథం న బిభేషి బాలే?
న్వస్తి పుంఖితశరో మదనః సహాయః!

దీనికి నా యనువాదము:

ఉ. ఇట్టి నిశీథమందుఁ దరళేక్షణ! యెచ్చటి కేఁగుచుంటివే?
గట్టిగ నాత్మకంటె నధికప్రియుఁడౌ జనుఁడున్నచోటికే!
కట్ట! యిదెట్టి సాహసమె? కాదొ భయం బిటులేఁగ నొంటిగన్?
పుట్టదు భీతి, మన్మథుఁడు పుంఖితమార్గణుఁ డుండె తోడుగన్!

అర్థము సులభము. పుంఖితమార్గణుఁడు=ఎక్కుపెట్టబడిన బాణములు గలవాఁడు (మన్మథుఁడు). మార్గణ మనగా బాణము.

కాళిదాసు ఋతుసంహారమునందలి ఈక్రింది శ్లోకము భయావహములగునట్లు మబ్బులు గ్రమ్మి, ఉరుములు ఉరుము చున్నను, వానిని లెక్క చేయక ఆమేఘముల మెఱుపులే దారి చూపుచుండగా అభిసారికలు వెడలుచున్నారని వర్ణించుచున్నది.

అభీక్ష్ణ ముచ్చై ర్ధ్వనతా పయోముచా
ఘనాంధకారీకృతశర్వరీష్వపి
తటిత్ప్రభాదర్శితమార్గభూమయః
ప్రయాన్తి రాగాదభిసారికాః స్త్రియః||

దీనికి నా యనువాదము:

ఉ. భీతి జనింపఁజేయుచు నభీక్ష్ణముగా నినదించు చంబుభృ
జ్జాతము లావరింప నతిసంతమసాఢ్యములైన రాత్రులం
దాతురరాగమత్తలగు నంగన లా ఘనజాతచంచలా
జాతము దారిసూప నభిసార మొనర్తురు చేరఁ గాంతులన్.

రాత్రి చీకటైనది. మబ్బులు గ్రమ్మినవి. ఉరుములు ఉరుముచున్నవి. మెఱుపులు మెఱయుచున్నవి. చిమ్మటలు పాడుచున్నవి. ఒక ముగ్ధాకాంత ఆచీకటిలో నభిసారమొనర్ప వెనుదీయుచున్నది. ఆమె నభిసార మొనర్పుమని ప్రోత్సహించుచు ఆమె చెలికత్తె యిట్లు పల్కుచున్నది.

దూతీ విద్యుదుపాగతా, సహచరీ రాత్రిః సహస్థాయినీ|
దైవజ్ఞో దిశతి స్వనేన జలదః ప్రస్థానవేలాం శుభామ్||
వాచం మంగళికీం తనోతి తిమిరస్తోమోఽపి ఝిల్లీరవైః|
జాతోఽయం దయితాభిసారసమయో ముగ్ధే విముంచ త్రపామ్||

దీనికి నా యనువాదము:

ఉ. దూతియొ నాఁగఁ గ్రొమ్మెఱుఁగు తోడయి వచ్చె, వయస్యరీతిగన్
రాతిరి గ్రమ్మె, చిమ్మటలరావములం దిమిరంబు మంగళా
మ్నాత మొనర్చె, గర్జనల మంచితఱిం బ్రకటించె నంబుద
జ్యౌతిషికుండు, బాల! యభిసారమొనర్పుము, వీడు వ్రీడమున్.

అర్థము సులభము. చీకటిలో భయంకరమగు వస్తువుల నన్నిటిని అభిసారమునకు హితమైన మంగళకరమైన వస్తువులుగా అభివర్ణించి, అంతగా ప్రణయము తెలియని ముద్దరాలిని అభిసారము చేయుమని చెలికత్తె ప్రోత్సహించుచున్నది. ఇది భానుదత్తుని రసమంజరిలో ముగ్ధాతమిస్రాభి సారిక కిచ్చిన యుదాహరణము.

గంగాదేవి రచించిన మధురావిజయకావ్యములో పై కాళిదాసు మేఘసందేశములోని శ్లోకమును బోలిన యీచిన్న శ్లోకము తమిస్రాభిసారికకు వర్తించునట్లుగా చమత్కారయుతముగా నున్నది.

అగమన్నభిసారికాః ప్రియా
ననురాగాంజనరంజితేక్షణాః|
అభినత్తిమిరేఽపి తాః పున
శ్శ్వసితేనైవ సుగన్ధినా జనః||

దీనికి నా యనువాదము:

తే. అంజనానురక్తుల నభిరంజితాక్షు
లగుచు, ధ్వాంతమందునఁ గలియంగఁ బ్రియులఁ
జనెడు నభిసారికాస్త్రీల జాడ దెల్పె
వదననిర్గతనిశ్వాసపరిమళంబె.

తాత్పర్యము: తమిస్రాభిసారికలు కంటికి నల్లని కాటుక వెట్టి, కన్నులందు అనురాగము రంజింప చీకటిలో పరులకు గనపడకుండ పోవు చున్నారు. కాని పరిమళాన్వితమైన తాంబూలములను వేసికొన్నారు. ఆఘుమఘుమలు వారి యూర్పుగాలుల మూలమున అంతటను ప్రసరించుచున్నవి. ఈవిధముగా వారు కనపడకున్నను వారి జాడ లితరులకు దెలియనే తెలియుచున్నవి.

పగటియందుగాని, రాత్రియందుగాని, ఉజ్జ్వలమైన వేషభూషాదులు ధరించి చక్కగా నలంకరించుకొని, ఇతరులు చూతురను జంకుకొంకు లేకుండ అభిసరించునది ఉజ్జ్వలాభిసారిక. ఇందుల కమరుకమందలి యీక్రింది శ్లోక ముదాహరణము.

ఉరసి నిహితస్తారో హారః కృతా ఘనే జఘనే|
కలకలవతీ కాంచీ, పాదౌ రణన్మణినూపరౌ||
ప్రియ మభిసరస్యేవ ముగ్ధే! త్వమాహతడిండిమా|
యది కి మధికత్రాసోత్కంపం దిశ స్సముదీక్షతే||

దీనికి నా యనువాదము:

చ. ఘనజఘనంబునందు ఘలుఘల్లను గజ్జెలపట్టె, యంఘ్రుల
న్మణుల రణించు నందెలు, స్తనంబుల ముత్తెపుదండ లూనుచుం
బణవము మోదినట్లు తెగువన్నభిసారమొనర్పనెంతు వై
నను దెస లేల జూతువు ఘనంబగు త్రాసముతోడ బేలవై!

తాత్పర్యము: అంతగా ప్రణయచాతుర్యము లేని యొక ముగ్ధ గొప్పనైన పిఱుదులపై ఘల్లుఘల్లురను గజ్జెల యొడ్డాణము ధరించినది. కాళ్లకు గణగణ ధ్వనించు మణుల యందెలు బెట్టికొన్నది. వక్షోజములపై తారహారము నలంకరించుకొన్నది. ఈవిధముగా నుజ్జ్వలవేషము ధరించినది. కాని ధైర్యముగా బోవక జంకుతో దిక్కులు చూడ నారంభించినది. ఆమెతో చెలికత్తె యనుచున్నది – ‘ఇంతగా నగారా వాయించినట్లు ధ్వనించుచు ప్రపంచమునకెల్ల నీఅభిసరణమును ప్రకటించుచున్నదో యనునట్లున్న ఆహార్యమును ధరించినావు. చేసే అభిసరణ మేదో చేయి. చేయకుండా బేలవై భయంతో దిక్కులెందుకు చూస్తున్నావు?’

శ్రీమతి చర్ల రత్నశాస్త్రిగారు పాడిన మత్కృతమైన ‘పతిచాటుదానరా’ అనునీపాట శ్రీకృష్ణునియం దాసక్తయైన తమిస్రాభిసారికాలక్షణమును ప్రతిబింబించునది.

పతిచాటుదానరా (కాపి రాగం)

పల్లవి:
పతిచాటు దానరా పగలింక మిగిలెరా
అతిచార మొనరింప నదనుకాదుర శౌరి
అ.పల్లవి:
కాలరాత్రిని పతిని కనుమొఱగి యేతెంతు
తాళురా గోపాల ఏలరా త్వర యింత
చరణం 1:
యామినీముఖమును యవనికం బోలె
శ్యామలంబగు తమం బావరించిన వేళ
కోమలాంఘ్రుల తులాకోటి సవ్వడి లేక
నేమమున నెమ్మదిగ నేతెంతురా స్వామి
చరణం 2:
నల్లని కాటుకను నయనాల దీర్చి
నల్లని వలువలో నాదు తనువును దూర్చి
నల్లపూసలపేరు నాకంఠమున గూర్చి
అల్లనల్లన రేయి నరుదెంతురా కన్న!
చరణం 3:
మతినిండ రతి నించు మధురనాదముతోడ
శ్రుతిపర్వమగు నీదు సుషిరంబు నాపరా
ప్రతినబూనితి రాత్రి వాలాయముగ వత్తు
శతపత్త్రదళనేత్ర! సరసగోపీమిత్ర!
కొన్ని పదముల కర్థములు: అతిచారము= మేర మీఱి (మర్యాద దప్పి ) ప్రవర్తించుట; యవనికంబోలె = తెరవలె; తులాకోటి సవ్వడి = కాలియందెల చప్పుడు; కోమలాంఘ్రులు=మృదువైన పాదములు; శతపత్త్రదళనేత్ర=తామరఱేకులవంటి కన్నులు గలవాఁడా.

విప్రలబ్ధ
క్వచిత్సంకేత మావేద్య దయితే నాథవఞ్చితా|
స్మరార్తా విప్రలబ్ధేతి కలావిద్భిః ప్రకీర్త్యతే||

అని విద్యానాథుని ప్రతాపరుద్రీయములో విప్రలబ్ధాలక్షణము.
‘ఒకానొక సంకేతస్థలమునకు రమ్మనిన ప్రియుడు, ఆ సంకేతమునకు తాను రాకుండుటచే వంచింపబడి, స్మరార్తయైన నాయిక విప్రలబ్ధ యని కలావిదులందురు’ – అని దీనికర్థము. భానుదత్తుడు రసమంజరిలో ‘సంకేతనికేతనే ప్రియమనవలోక్యసమాకులహృదయా విప్రలబ్ధా| అస్యాశ్చేష్టా నిర్వేద నిశ్వాస సంతాపాలాప భయ సఖీజనోపాలంభ చింతాశ్రుపాత మూర్ఛాదయః|’ – అన్నాడు. ‘సంకేతనికేతనమున ప్రియుని గానక వ్యాకులమతి యగునది విప్రలబ్ధ. తత్ఫలితముగా నీమె నిర్వేదము, నిశ్వాసము, సంతాపము, ప్రలాపము, భయము, చెలులను, పరిసరములను నిందించుట, చింతించుట, ఏడ్చుట, మూర్ఛిల్లుట – అను చేష్టలను చేయును’ – అని ఈ లక్షణమున కర్థము. నాట్యశాస్త్రములో భరతుడును ఈచేష్టలచేతనే విప్రలబ్ధ తన యవస్థ నభినయించవలెనని తెల్పినాడు. దీనికి మదుక్తమైన యొక యుదాహరణము:

చ. తమకము మీరఁగాఁ గృతకధైర్యముతోడఁ బ్రియోక్తవాటికిం
గమలదళాక్షి వచ్చి యటఁ గానక వల్లభు నిందసేయుఁ బు
న్నమచలివెల్గు నభ్రవిపినంబున వెల్గు దవాగ్ని యంచు, ఋ
క్షములను విస్ఫులింగములసంఘము లంచు వియోగతప్తయై.

వివరణ: ఋక్షము లనగా నక్షత్రములు. ఒక ముగ్ధ పున్నమనాటి రాత్రి ప్రియుని గవయవలెనను నుత్కటేచ్ఛతోడ తెచ్చికోలు ధైర్యముతో ప్రియుడు రమ్మనిన తోటకు వచ్చినది. కాని అతడేమో యట లేడు. చాలసేపు నిరీక్షించినది కాని అతడు వచ్చు జాడ కన్పడలేదు. ఎంతో తమకముతో నున్న యామె కా వియోగము దుస్సహమైనది. చల్లని పూర్ణిమాచంద్రుడు, తళతళలాడు నక్షత్రము లింకను ఆతాపము నధికము చేసినవి. అందుచే నామె రాకాశీతకరుని ఆకాశమను నరణ్యములో మండు దవాగ్ని యని, నక్షత్రముల నా యగ్నియొక్క విస్ఫులింగములని నిందించినది. విప్రలబ్ధానాయికయొక్క నిందాచేష్టిత మిందు వర్ణింపబడినది.

విద్యానాథుని ప్రతాపరుద్రీయములో నీయబడిన విప్రలబ్ధోదాహరణమునకు శ్రీమాన్ చెలమచర్ల రంగాచార్యులవారి అనువాద మీక్రింది పద్యము:

మ. నడు చేటీ!యిట ముందు, వీడు మిఁక నా నాథాగమాలాపముల్,
నడురే యయ్యె; వృథా మదశ్రుకణసంతానమ్మునన్ ఱొంపి పు
ట్టెడు సంకేతగృహంబ; పోయెద; వధూటీభూష భాషన్, సిరిం,
బుడమిం, గేళులఁ దేల్చు ఱేఁ డనక రా మోసంబు వాటిల్లెఁగా!

వివరణ:నాయకుడగు ఱేడొక కాంతను సంకేతగృహమునకు రమ్మనెను. ఆమె చక్కగా నలంకరించుకొని చెలికత్తె వెంట రాగా అచ్చటి కేగెను. కాని యతడు రాడయ్యెను. అత డిప్పుడు వచ్చు నప్పుడు వచ్చునని చెలికత్తె ఆమెకు ధైర్యము చెప్పినది. అట్లు నాయిక నడురేయి దాక అతనికై ఉత్కంఠతో ఎదురు చూచినది. విరహతప్తయై రోదించినది. ఆశ్రువులచే నేల ఱొంపి యైనది. కాని అతని జాడలు లేవు. నిరాశచే నిక మఱలిపోవుట కుద్యమించి, చెలికత్తెతో ననుచున్నది ‘ ఓ చెలీ! అర్ధరాత్రి యైనది. నా నాథునిజాడలు లేవు. నా యశ్రువులచే (రతిస్వేదముచే గాదు) నేల ఱొంపి యైనది. అతడో వధూటీమణి యైన భాషాయోషతోను, (సామ్రాజ్య)లక్ష్మితోను, భూదేవితోను కేళీలోలుడై యున్నాడు. అటువంటి బహు నాయికాలంపటుని గోరి వచ్చుటే నా పొరపాటు. ఇక నడు. తిరిగి పోదము’. ఈ యుదాహరణములో విప్రలబ్ధానాయికయొక్క నిర్వేదము, రోదనము, సంతాపము, ప్రలాపము అను చేష్టలు వర్ణితము లైనవి.

భానుదత్తుని రసమంజరిలోని యీక్రింది శ్లోకములో ఉత్కంఠాపూరితురాలైన విప్రలబ్ధావర్ణనము రమ్యముగా సాగినది.

స్నాతం వారిదవారిభి, ర్విరచితో వాసో ఘనే కాననే|
పుష్పైశ్చన్దనబిన్దుభి ర్మనసిజో దేవ స్సమారాధితః||
నీతా జాగరణవ్రతేన రజనీ, వ్రీడా కృతా దక్షిణా|
తప్తం కిం న తపస్తథాపి స కథం నాద్యాపి నేత్రాతిథిః||

దీనికి నా యనువాదము:

ఉ. స్నానము చేసితిన్ జలదసంస్రుతవారి, వసించితి న్మహా
కాననమందుఁ, గొల్చితిని గంధసుమంబులతో మనోభవున్,
పూనితి రాత్రి జాగరణ, పొందుగఁ బెట్టితి వ్రీడదక్షిణన్,
నేనిటులం దపించినను నేత్రగతుం డతఁ డేల గాడొకో!

అర్థము: పరులకంట బడకుండ రాత్రిపూట దూరాటవిలో సంకేతమునకు వచ్చి, ప్రియు డచ్చట లేకుండుటచే వంచితయైన నాయిక తాను నాయకదర్శనమునకై తపస్సు చేసినను అతడెందుకీ రాత్రి కనపడుట లేదని ఈవిధముగా తర్కించుకొనుచున్నది.

వారిదవారిభిః = వర్షజలముచేత, స్నాతం=(నాచేత)స్నానము చేయబడినది. వర్షజలము అన్నిటికంటె స్వచ్ఛమైనది. అందులో చేసిన స్నానము తపస్వుల కతిపవిత్రమైనది. ప్రియునికొఱకై వర్షములో దాను స్థాణువువలె నిల్చి తడిసిపోయితినని నాయికయొక్క అభిప్రాయము.

ఘనే కాననే వాసః విరచితః = గొప్ప యడవిలో వాసము చేయబడినది. తపస్వులు దూరారణ్యములో వసించుట ప్రసిద్ధము. ప్రియునికొఱకై తాను భీకరారణ్యములో నుంటినని నాయికయొక్క అభిప్రాయము.

మనసిజో దేవః = మనస్సులో నున్న దేవుడు, పుష్పైశ్చన్దనబిన్దుభిః = పుష్పములచేతను, గంధపంకముచేతను, సమారాధితః=బాగుగా నర్చింపబడెను. మనస్సులో నున్న ఇష్టదైవమును తపస్వులు గంధపుష్పాదులచేత నర్చించుట ప్రసిద్ధము. మనసిజు డనగా మన్మథుడు. కాముకుల మనస్సే అతని జన్మస్థానము. అందుచేత తానభిసరించుటకై యలంకరించుకున్న పుష్పగంధలేపములచే తనలో నున్న మన్మథు డర్చింపబడినాడని నాయికయొక్క అభిప్రాయము.

జాగరణవ్రతేన=నిద్రలేమి యను వ్రతముచే, రజనీ=రాత్రి, నీతా=గడపబడినది. దైవదర్శనమునకై తపస్వులు రాత్రుల జాగరణవ్రతమును చేయుట ప్రసిద్ధము. నాయకునికై రాత్రియంతయు నిద్ర దొఱగి యుంటినని నాయికయొక్క అభిప్రాయము.

వ్రీడా=సిగ్గే, కృతా దక్షిణా= దక్షిణగా చేయబడినది. పూజాంతమున ఋత్విజులకు దక్షిణ నిచ్చుట ప్రసిద్ధము. నా సిగ్గును ఇతరులకు దక్షిణప్రాయముగా వదలుకొని నీ కడకు వచ్చితినని నాయికయొక్క అభిప్రాయము.

తప్తం కిం న తపః = నేను చేయని తపస్సేది గలదు? ఉక్తవిధముగా అన్ని తపస్సులు చేసితి ననుట, తథాపి=అట్లైనను, అద్యాపి=ఇప్పుడు, సః=అతడు, కథం న నేత్రాతిథిః = ఎట్లు నేత్రగోచరు డగుట లేదు?

తాత్పర్యము: వ్రతనిష్ఠులైన తపస్వులు చేసినట్లుగా పావనజలస్నానము, వనవాసము,సుమగంధములచేత చిత్తములో నున్న దేవుని యర్చనము, రాత్రియందు జాగరణము, దక్షిణప్రదానముల నన్నిటిని చేసితిని. ఒక నేను చేయని వ్రతమేమున్నది? ఐనను నా ప్రభువు నా కక్షిగోచరు డెందు కగుట లేదు? – అని నాయిక వితర్కించుచున్నది. భక్తితో చేయు తపఃక్రియ లన్నిటిని ప్రణయక్రియలతో సంవదించుట ఈశ్లోకము నందలి చక్కనైన చమత్కారము.

చివరిగా శ్రీమతి చర్ల రత్నశాస్త్రిగారు పాడిన మత్కృతమైన ‘చేరవచ్చితి గాని చెల్వుడిట లేడు’ అనునీపాట విప్రలబ్ధయైన జ్యోత్స్నాభిసారికాలక్షణమును ప్రతిబింబించునది.

చేరవచ్చితిగాని (దేశ్ రాగం)

పల్లవి:
చేరవచ్చితి గాని చెల్వుడిట లేడు
సంకేతమున వానిజాడలే లేవు
అ.పల్లవి:
నిండుపున్నమరేయి నినుజేర వత్తు
తోటలో ననె గాని మాటుచేసెను మోము
చరణం 1:
చెలువూన దలలోన తెలిమల్లెవిరులు
పొలుపూన గళమందు ముత్యంపుసరులు
చెలువార తనువందు తెలిచీరపొరలు
లలిమీర కౌముదీలక్ష్మివలె నేను
చరణం 2:
మాయమాటలు వల్కి మక్కువలు సేసి
తోటకును రమ్మనగ తొలియామమందె
వానిమాటలు నమ్మి వలదన్న చెలులు
ముస్తాబు చేసికొని మురిపెంబు మీర
చరణం 3:
చాటుమాటుగ నేను సంకేతమును జేర
తాను రాడయ్యె వలపూనగా బలికి
ఎంత ఆశయొ కాని సుంత సవ్వడి విన్న
అతడేమొ యని కన్ను లంతటను జూచు

స్వాధీనపతిక, ప్రోషితభర్తృక
రచన: తిరుమల కృష్ణదేశికాచార్యులు జూలై 2016
కావ్యరసములలో శృంగారమును రసరాజముగా లాక్షణికు లంగీకరించి యుండుట సర్వజనవిదితమే. ఇట్టి శృంగారరసమునకు ఆలంబనములు నాయికానాయకులు. నాయికానాయకుల యొక్క చక్షుష్ప్రీతి, మనస్సంగములవల్ల కలుగు మనోవికారమే రూఢమై శృంగారరసముగా పరిణమించును. దీనికి పరిసరములందలి సురభిళానిల సుందరోద్యాన చంద్రికాదిసన్నివేశములును, పరస్పరాభిహితమైన ఆహార్యాంగహార చేష్టాదులును ఉద్దీపకములుగా లాక్షణికులు గుర్తించినారు. ఇవన్నియు అనురక్తులైన నాయికానాయకుల అనుభవ మందున్నవే. వీనినే లాక్షణికులు సిద్ధాంతీకరించినారు. నాయికావిషయప్రసక్తిలో ఆసక్తికరమైన విషయము అష్టవిధశృంగారనాయికావర్గీకరణము. ఇది నాయికా తాత్కాలిక మనోధర్మవర్గీకరణమే కాని, నాయికాప్రకృతివర్గీకరణము కాదు. అనగా ఒకే నాయిక తత్తత్కాలమనోధర్మము ననుసరించి, ఈ అష్టవర్గములలో ఏదో యొక వర్గమునకు చెందియుండుననుట. కావ్యాలంకారసంగ్రహములో ఈ శృంగారనాయికల లక్షణము లిట్లు చెప్పబడినవి:

సీ.వరుఁడు కైవసమైన వనిత స్వాధీనభ
ర్తృక; ప్రియాగమవేళ గృహముఁ,దనువు
సవరించు నింతి వాసకసజ్జ; పతిరాక
తడవుండ నుత్కంఠఁ దాల్చునింతి
విరహోత్క; సంకేత మరసి, నాథుఁడు లేమి
వెస నార్తయౌ కాంత విప్రలబ్ధ;
విభుఁడన్యసతిఁ బొంది వేఁకువ రాఁ గుందు
నబల ఖండిత; యల్క నధిపుఁ దెగడి

గీ. అనుశయముఁ జెందు సతి కలహాంతరిత; ని
జేశుఁడు విదేశగతుఁడైనఁ గృశతఁ దాల్చు
నతివ ప్రోషితపతిక; కాంతాభిసరణ
శీల యభిసారికాఖ్యయై చెలువు మెఱయు.

(అనుశయము=పశ్చాత్తాపము)

పై పద్యములో ఈ అష్టవిధనాయికల పేర్లు సాంద్రమైన (Bold)అక్షరములతో గుర్తింపబడినవి. కడచిన రెండు ఈమాట సంచికలలో వాసకసజ్జికా, విరహోత్కంఠితా, ఖండితా, కలహాంతరితాలక్షణములను కొంత వివరించినాను. ఇప్పుడు స్వాధీనపతికా, ప్రోషితభర్తృకా అను నాయికలను గుఱించి వివరించి, వారి మనోధర్మములను ప్రతిబింబించునట్లుగా నేను వ్రాసిన గీతములను శ్రవ్యమాధ్యమములో ప్రదర్శింతును. ఇదియే ఈ వ్యాసము యొక్క ఆశయము.

స్వాధీనపతిక
యస్యా రతిరసాస్వాదముదితో దయితస్సదా|
సదైవాస్తే తయా సాకమేషా స్వాధీనభర్తృకా||
ఉద్యాన సలిలక్రీడా కుసుమాపచయక్రియా|
ఆపానకేళిః శక్రార్చా వసంతమదనోత్సవాః||
స్వాధీనభర్తృకాయాః స్యుర్విలాశ్చైవమాదయః|

అని శారదాతనయుని భావప్రకాశికలో స్వాధీనపతికాలక్షణము. రతిరసాస్వాదనచే ముదితుడైనవాడును, ఎల్లప్పుడు తనతో సహచరించు వాడును గల దయితుడు (భర్త) కలిగినది స్వాధీనపతిక, అని దీని కర్థము. ‘అట్టినాయిక ఉద్యానవన విహరణమందును, జలక్రీడయందును, కుసుమాపచయమందును, పానగోష్ఠియందును ఆసక్తురాలై యుండును. ఇంద్రపూజయందును, వసంతమదనోత్సవముల యందును నుత్సుకురాలై యుండును’ అని తన కధీనుడై తన కనుసన్నలలో మెలగు పతి గల యామెయొక్క విలాసక్రియలు పైశ్లోకములలో పేర్కొన బడినవి. గమనిక: ఇచ్చట భర్తృపదమునకు అనుకూలుడైన ప్రియుడని అర్థము చెప్పవలెను. ఏలనన లక్షణగ్రంథములలోను, కావ్యములలోను స్వీయకే కాక పరకీయాదులకు గూడ స్వాధీనపతికా, ప్రోషితపతికావస్థలు చెప్పబడినవి.
భరతుని నాట్యశాస్త్రములో స్వాధీనపతికాలక్షణ మిట్లున్నది:

సురతాతిరసైర్బద్ధో యస్యాః పార్శే తు నాయకః|
సాన్ద్రామోదగుణప్రాప్తా భవేత్ స్వాధీనభర్తృకా||

నాయకుడు సురతాతిరసబద్ధుడై, తన చెంతనుండగా నధికమైన హర్ష-సౌభాగ్య-అభిమానాదులను కలిగియుండునది స్వాధీనపతిక అని దీని కర్థము. ‘స్వాధీనః భర్తా పతిర్వా యస్యాః సా స్వాధీనభర్తృకా పతికావా (=తన కధీనుడైన భర్త లేక పతి గల్గిన స్త్రీ)’ అని స్వాధీనభర్తృక లేక పతికకు వ్యుత్పత్తి. కావ్యాలంకారసంగ్రహములోని ‘వరుఁడు కైవసమైన వనిత స్వాధీనభర్తృక’ అను రామరాజభూషణుని నిర్వచనము దీనికి సరిపడుచున్నది. ఇందులో ‘సదా=ఎల్లప్పుడు’ అను కాలనిర్దేశము లేదు. ఇదియే సరియైనదిగా దోచుచున్నది. ఏలనన స్వాధీనపతికాదిశృంగార నాయికాలక్షణములు తత్కాలావస్థాభేదములే కాని శాశ్వతస్వభావలక్షణములు కావు. అందుచేత దక్షిణనాయకుడు సైతము తత్కాలములో నాయికకు పరిపూర్ణముగా వశుడై యుండవచ్చును. అట్టి నాయిక స్వాధీనపతిక కావచ్చును. శ్రీకృష్ణుడు దక్షిణనాయకుడైనను జయదేవుని గీతగోవిందములో రాధకు విధేయుడైనవానిగనే చిత్రింపబడినాడుగదా! పారిజాతాపహరణములోను

శా. ఏయేవేళల నేసరోజముఖి యేయేలీలలం గోరుఁ దా
నాయావేళల నాసరోజముఖి నాయాలీలలం దేల్చి యే
చాయం జూచినఁ దానయై మెలఁగుచున్ సౌఖ్యాబ్ధి నోలాడు భో
గాయత్తుండయి పెక్కురూపముల మాయాకల్పనాచాతురిన్

అని ముక్కుతిమ్మన శ్రీకృష్ణుని మాయాశక్తిచేత బహురూపములు ధరించి, అష్టమహిషుల కనుకూలుడైన భర్తగా వర్ణించినాడు. వారందఱి కతడు స్వాధీనుడైన పతిగనే భాసించినాడు. అందుచేతనే అతడు పారిజాతమును రుక్మిణి కొసగెనను వార్త విన్నంతనే సత్యభామ అతనిని పరాధీనుడైన వానిగా దలంచి నిందించినది. అతడు తన కధీనుడుగా నుండినప్పుడు ఉభయులు నెరపిన విలాసక్రియల నీక్రిందివిధముగా స్మరించుకొని పరితపించినది:

సీ. కలలోన నైన నవ్వులకైన నామాట జవదాఁట వెఱచునో చంద్రవదన!
యేపదార్థంబు నాయెదుటఁ బెట్టక మున్న యెవ్వారి కొసఁగడో యిగురుఁబోడి!
చెలులు నాతో నేమి చెప్పుదురో యని లంచంబు లిచ్చునో చంచలాక్షి!
తోడిచేడియలు నాతోడివంతులకు రా సయిరింపఁజాలఁడో సన్నుతాంగి!

తే. యరమరలు లేని కూరిమి ననఁగి పెనఁగి,
కొదలు దీఱని కోర్కులఁ గూడి మాడి,
కపట మెఱుఁగని మమతలఁ గలసి మెలసి,
యున్న విభుఁడిట్లు సేయునే యోలతాంగి! – పారిజాతాపహరణము 1-94.

పై పద్యములో నాయిక కధీనుడైన పతియొక్క స్వభావము చక్కగా వర్ణింపబడినది. ఇందులో అనగి పెనగి, కూడి మాడి, కలసి మెలసి యను జాతీయముల ప్రయోగముతో ‘ముద్దుపలుకుగా’ నీపద్యమును ముక్కుతిమ్మన తీర్చిదిద్దినాడు. అట్లు పరస్పరాధీనులై వారు కావించిన కేళీవిలాసములను సత్యభామ యీక్రిందివిధముగా గుర్తుచేసికొనుచున్నది:

సీ.కృతకాద్రికందరాకేళీ నిగూహనవేళా పరస్పరాన్వేషణములు,
పోషితమాధవీపున్నాగపరిణయోత్సవ కల్పితానేకసంభ్రమములు,
చాతురీనిర్జితద్యూతపణాదాన కలితచేలాంచలాకర్షణములు,
సాయంసమారంభచక్రవాకద్వంద్వ విరహావలోకన విభ్రమములు,

తే. సాంద్రతర చంద్రికాకేళి చంక్రమములు,
విధుశిలామయవేదికా విశ్రమములు,
ఫలకచిత్రిత నిజరూప భావనములు,
మఱచెనో కాక రుక్మిణిమాయఁ దగిలి. – పారిజాతాపహరణము 1-95.

వివరణ: పూర్వము ధనికుల ప్రమదావనములలో కృత్రిమశైలము లుండెడివి. ఇట్టి శైలకందరములలో దాగుడుమూతలాడుటలు, ఉద్యాన వనములో బెంచుకొన్న బండిగురివెందతీగకు పొన్నచెట్టునకు చేసిన వివాహసంరంభములు, పణము లొడ్డి యాడిన అక్షక్రీడల అవసానమున పణము చెల్లింపుమని చేలాంచలములను బట్టి లాగుటలు, సాయంకాలమున ఆసన్నమగు విరహము నెంచి తమిదీర్చుకొనుచున్న చక్రవాకదంపతులను సానురాగముగ జూచుటలు, పండువెన్నెల రాత్రులందలి వెన్నెలయాటలు, (చల్లనైన) చంద్రకాంత శిలావేదికలందు (ఒరసికొని కూర్చుండి) విశ్రమించుటలు, పరస్పరరూపములు పలకలయందు జిత్రించుకొని, వాని యందచందములను సవిలాసముగా భావించుటలు – ఇవన్నియు మున్ను పరిపూర్ణముగ శ్రీకృష్ణుడు తనకు వశుడై యున్నప్పుడు, అనగా తాను స్వాధీనపతికయైనప్పుడు, చేసినట్టి విలాసకార్యములు – ఇప్పుడు రుక్మిణి మాయలోబడి వాటి నన్నిటిని విస్మరించుచుండెనా యని సత్యభామ పలవించినది.

అమరుక, గీతగోవింద, పుష్పబాణవిలాసాదిగ్రంథములలో ఇట్టి నాయికానాయకుల స్వభావముల చిత్రించు అందమైన ఉదాహరణము లెన్నియో యున్నవి. పుష్పబాణవిలాసములోని ఈక్రింది శ్లోకమును చూడుడు:

శేతే శీతకరోఽమ్బుజే, కువలయద్వన్ద్వాద్వినిర్గచ్ఛతి!
స్వచ్ఛా మౌక్తికసంహతి, ర్ధవళిమా హైమీం లతామఞ్చతి||
స్పర్శాత్ పఙ్కజకోశయో రభినవా యాన్తి స్రజః క్లాన్తతామ్|
ఏషోత్పాతపరమ్పరా మమ సఖే! యాత్రాస్పృహాం కృన్తతి||

ఈ అందమైన శ్లోకమునకు నా భావానువాదము:

ఉ. నీరజవైరి యబ్జమున నిద్రను బూనె, సుమౌక్తికావళుల్
కైరవయుగ్మమందొదవె, కాంచనవల్లిక తెల్లనయ్యె, నం
భోరుహకుట్మలంబులను బూలసరంబులు దాఁకి మ్లానతం
గూరెను, దుర్నిమిత్తములు గూడఁగ నిట్టులఁ బోవమానితిన్.

వివరణ: నాయికావిధేయుడైన నాయకు డొకడు హఠాత్తుగా తన ప్రయాణమును మానుకొన్నాడు. దానికి కారణ మేమి యని ప్రశ్నించు తన సఖునితో నతడిట్లు పలుకుచున్నాడు. శీతకరః=చంద్రుడు, అమ్బుజే=కమలమునందు, శేతే=శయనించుచున్నాడు; స్వచ్ఛా మౌక్తిక సంహతిః =స్వచ్ఛమైన ముత్యముల సమూహము, కువలయద్వన్ద్వాత్=కలువలజంటనుండి, వినిర్గచ్ఛతి=వెలువడుచున్నది; హైమీం లతామ్ = బంగారుతీగెను, ధవళిమా=తెల్లదనము, అఞ్చతి=పొందుచున్నది; పఙ్కజకోశయోః=పద్మకుట్మలములయొక్క, స్పర్శాత్=తాకిడివల్ల, అభినవా స్రజః = (అప్పుడే కూర్చిన) పూలదండలు, క్లాన్తతామ్=వాడుటను, యాన్తి=పొందుచున్నవి; సఖే=ఓ మిత్రమా! ఏషోత్పాతపరమ్పరా = ఈ దుర్నిమిత్తముల వరుస, మమ =నాయొక్క, యాత్రాస్పృహాం=ప్రయాణేచ్ఛను, కృన్తతి= ఛేదించు (చంపు)చున్నది.

కమలవిరోధియైన చంద్రుడు కమలములోనే పరుండుట, కలువలజంటనుండి మంచిముత్తెములు రాలుట, (హఠాత్తుగా ) బంగారుతీగె తెల్లవాఱుట, పద్మకుట్మములను తాకగనే క్రొత్తనైన పూదండలు వాడిపోవుట, ఇట్టి దుశ్శకునములు పొడసూపినవి. అందుచేత శ్రేయస్కరము కాదని నాప్రయాణము నాపికొంటిని. అనగా, నాయకుని ప్రయాణవార్తను వినగానే స్వాధీనపతిక కావున నాతని విడిచి యుండలేని నాయిక తన చేతిలో మోము నానించుకొని సంతాపమును బూనినది. అనగా పద్మమువంటి ఆమె చేతిలో చంద్రునివంటి యామె ముఖము విశ్రమించినది. ఇది యొక సంతాపసూచకభంగిమ. కలువలజంట(వంటి ఆమె కన్నుల)నుండి మంచిముత్తెములు (అనగా శోకబాష్పములు) రాలినవి. బంగరుతీగె (వంటి ఆమె మైదీగె హఠాత్తుగా) పాలిపోయినది. (విరహతాపముచే వేడెక్కిన యామె తనువందలి స్తనములనెడి) కమలపుమొగ్గలను తాకగనే మెడలో వేసికొన్న క్రొత్తనైన పూదండలు వాడిపోయినవి. ఇట్లు తన యెడబాటువార్త ఆమెను అత్యంతఖిన్నురాలిని జేయుటచేత ప్రయాణము నాపికొంటి నని నాయకుడు తెల్పుచున్నాడు. నాయికకు పరిపూర్ణముగా వశుడైన నాయకునికిని, అట్లు స్వాధీనపతిక యైన నాయికకును నిది మంచి ఉదాహరణము.

ఇట్లే స్వాధీనపతికయైన రాధిక తనకు పరిపూర్ణముగ వశవర్తుడైన కృష్ణునిచేత సురతాంతమున సింగారపుటూడిగములు చేయించుకొనుట జయదేవుని గీతగోవిందమునందలి ఈక్రింది శ్లోకములో చక్కగా చెప్పబడినది:

రచయ కుచయోః పత్త్రం, చిత్రం కురుష్వ కపోలయోః|
ఘటయ జఘనే కాఞ్చీ, మఞ్చ స్రజం కబరీభరే||
కలయ వలయశ్రేణీం పాణౌ, పదే కురు నూపురౌ|
ఇతి నిగదితః, ప్రీతః పీతామ్బరోఽపి తథాఽకరోత్||

దీనికి నా భావానువాదము:

చ. స్తనముల పత్త్రభంగములఁ జక్కగఁ దీర్పుము; చెక్కులందునన్
గొనబుగ నుంచు చిత్రకము; కొప్పునఁ బెట్టుము పూసరంబులన్;
ఘనజఘనానఁ గాంచికను, కంకణనూపురముల్ కరాంఘ్రులం
దొనరఁగఁ గూర్పుమన యోషిత కట్టులె చేసెఁ గృష్ణుఁడున్.

వివరణ: గాఢమైన సురతాంతమున స్తనముల నలంకరించుకొన్న పత్త్రభంగములు, చెక్కుల నున్న చిత్రకములు, కొప్పున గైసేసిన పూసరములు, పాదములందలి యందెలు, కరములందలి కంకణములు, జఘనమునందలి మొలనూలు విశ్లథములు, విశ్లిష్టములు నైనవి. అట్టి రూపముతో బయటి కేగుట యసంభవము. అందుచే వానిని పునారచనము చేయుమని స్వాధీనపతికయైన రాధిక శ్రీకృష్ణుని కోరినది. అతడు పరిపూర్ణ విధేయతతో, ప్రేమతో యథోక్తముగా నామె నలంకరించినాడు. ఇటువంటి స్వాధీనభర్తృకోదాహరణమే రసార్ణవసుధాకరములోని ఈక్రింది శ్లోకములో నున్నది:

సలీలం ధమ్మిల్లే దరహసితకహ్లారరచనాం|
కపోలే సోత్కంపం మృగమదమయం పత్త్రతిలకమ్||
కుచాభోగే కుర్వన్ లలితమకరీం కుంకుమమయీం|
యువా ధన్యః సోఽయం మదయతి చ నిత్యం ప్రియతమామ్||

దీనికి నా భావానువాదము:

చ. చెలువుగఁ గేశపాశమునఁ జెంగలువల్ గయిసేసి, వేడ్క రం
జిల మృగనాభిపత్త్రమయచిత్రకముల్ రచియించి చెక్కులన్,
వలుదపుగుబ్బలందునను వ్రాసి వరాన్వితపత్త్రరేఖలన్,
చెలిని సతంబు సంతసిలఁజేసెడు ప్రౌఢుఁడె ధన్యుఁడౌగదా!

వివరణ: కేశపాశము=కొప్పు; మృగనాభిపత్త్రమయచిత్రకముల్ = కస్తూరితోబెట్టిన పత్ర్రముల తిలకరేఖలు; ‘మృగనాభి ర్మృగమదః కస్తూరీ’ అని అమరకోశము. వరాన్వితపత్త్రరేఖలన్ = కుంకుమతో గూడిన మకరికాదిపత్త్రరేఖలను. వర మనగా కుంకుమపువ్వు.
‘కాశ్మీరజన్మాగ్నిశిఖం వరం బాహ్లీక పీతనమ్’ అని అమరము. ఈకాలపు స్త్రీలు ‘eye shadow’, ‘blush’ వంటి వాటితో అంగసంస్కారం (makeup) చేసికొనినట్లు పూర్వము స్త్రీలు చెక్కిళులపై, స్తనములపై మకరికాదిరూపములలో కస్తూరీకుంకుమాదులతో రేఖలను రచించుకొనెడివారు. ఇట్టి రేఖలకే పత్త్రభంగములు లేక పత్త్రకము లని పేరు. ఇట్లు కొప్పునందు చెంగలువల నలంకరించి, కస్తూరీచిత్రరేఖలను కపోలములందు, కుంకుమ పత్త్రభంగములను స్తనములందును దీర్చి, ప్రియురాలిని సంతసింపజేయునట్టి యువకుడే ధన్యుడు గదా యని పైశ్లోకమున కర్థము. ఇట్లు ప్రియునిచే చేయించుకొను నాయిక స్పష్టముగా స్వాధీనపతికయే.

వశీకృతపతియైన స్వాధీనపతిక సంతుష్టాంతరంగయై యుండుట సహజమే. నాట్యనాటకాదులలో నిట్టి నాయిక ఉజ్జ్వలవస్త్రభూషణాంచిత వేషము, ప్రమోదవికసితాననము, అధికమైన శోభ – వీనితో తన యవస్థను నిరూపింపవలెనని భరతుడు తెల్పినాడు.

శ్రీమతి చర్ల రత్నశాస్త్రిగారు పాడిన మత్కృతమైన ‘చాలులే ప్రియురాల’ అను ఈ పాట స్వాధీనుడైన కాంతుని అనురక్తిని ప్రతిబింబించునది.

చాలులే ప్రియురాల (మాండ్ రాగం)

పల్లవి:
చాలులే ప్రియురాల చాలునివె చాలు
పదవులేలా, సంపదలు నాకేల?
అ.పల్లవి:
వలపునిండిన నీదు వాల్చూపుచాలు
మంగళారతులయి మలసినం జాలు |చాలులే|
చరణం 1:
లలితంపు కరముల న్నళినంపు చెల్వలను
మెలమెల్ల రవి దట్టి మేల్కొలుపు సమయాన
గలగలా మ్రోగు నీ గజ్జెలందెల రవమె
ఎలమితో నెదనెల్ల కలగింప జాలు |చాలులే|
చరణం 2:
వలపూని జంటలై జలములం దూగుచు
అలవోకగా సాగు హంసమిథునము గాంచి
పులకించు నీలోన దులకించు భావాల
వెలయించు నీమోము వీక్షించుటే చాలు |చాలులే|
చరణం 3:
కమలాల చుంబించు భ్రమరాల దిలకించు
నిను గాంచి నీమోము నీరజంబే యంచు
గాటంగ నేతెంచు తేటులకు వెఱచి
గాటముగ నను నీవు కౌగిలించుటె చాలు |చాలులే|
చరణం 4:
నాయాత్మనిలయాన నానంద మెసగ
నిశ్చలంబుగ నీవు నివసించుటే చాలు
నీయాత్మముకురాన నిరతంబు నామూర్తి
గాంచుచుండెడి నిన్ను గాంచుటే చాలు |చాలులే|
ప్రోషితభర్తృక
అనురక్తుడైన వల్లభుఁడు తన కనుసన్నులలో మెలగుచుండగా సుఖాసక్తయైన స్వాధీనపతిక అతడు ప్రవాసమున కేగగా ఖిన్నయగుట సహజమే. ఇట్టి నాయికకే ప్రోషితపతిక లేక ప్రోషితభర్తృక = (ప్ర+ఉషిత=ప్రవాసగతుడైన, భర్తృక=భర్త(పతి)గలది) అని పేరు. ఇట్లు స్వాధీనపతికాప్రోషితపతికలకు సహజమైన పారంపర్యమున్నది. సింగభూపాలుని రసార్ణవసుధాకరములో ప్రోషితభర్తృకాలక్షణ మిట్లున్నది:

దూరదేశం గతే కాన్తే భవేత్ ప్రోషితభర్తృకా|
అస్యాస్తు జాగరః కార్శ్యం నిమిత్తాదివిలోకనమ్||
మాలిన్యమనవస్థానం ప్రాయః శయ్యానిషేవనమ్|
జాడ్యచిన్తాప్రభృతయో విక్రియా కథితా బుధైః||

వివరణ: పతి దూరదేశమున కేగి సమయమునకు రాకున్నను, రాజాలకున్నను విరహముచే ఖిన్న యగునది ప్రోషితభర్తృక. ఇట్లు విభునికై పరితపించు నాయిక జాగరము (నిద్రలేమి), శరీరకృశత్వము, పత్యాగమనసూచకశుభశకునవిలోకనము, మలినవేషము, అస్థిరత, జాడ్యము, చింత, ముహుః శయ్యాపతనము – ఇటువంటి చేష్టాపరంపరలచేత తన ఖిన్నతను ప్రదర్శించుచుండును. రామరాజభూషణుని ‘నిజేశుఁడు విదేశగతుఁడైనఁ గృశతఁ దాల్చు నతివ ప్రోషితపతిక’ అను లక్షణము దీనిలో నంతర్భాగముగనే యున్నది.

పైలక్షణములలో ప్రియుడు దూరదేశగతుడు కావలెనను నిర్దేశమున్నది. అట్లుగాక ప్రియుడు దూరదేశమున కేగునను వార్త విన్నంతనే నాయిక ఖిన్నురాలు గావచ్చును. ఇట్టి నాయిక నవమశ్రేణికి చెందిన ప్రవత్స్యత్పతిక (ప్రవత్స్యత్=ప్రవాసమునకు వెడలుచున్న, పతిక= ప్రియుడు గలది) యగునని కొందఱు లాక్షణికులు తెల్పుచున్నారు. కాని అగ్రిమక్షణములో కాంతుడు ప్రవాసమున కేగునని తెలిసినను, ఏగుచున్నను (అనగా ప్రయాణములో నున్నను), ఏగినను కలుగు విరహావస్థలు తుల్యములు గనుక ప్రోషికపతికానిర్దేశము ఈ మూడవస్థలకు వర్తింపజేయవలె ననియు, అందుచేత ‘ప్రవత్స్యత్పతికా’ యను నవమశృంగారనాయికానిర్దేశ మనవసరమనియు, అది ప్రోషితభర్తృకావస్థా భేదమే యనియు శృంగారమంజరీ, శృంగారామృతలహరీ గ్రంథకర్తల అభిప్రాయము. ఇదియే సమంజసముగా దోచుచున్నది. ఈ ప్రవత్స్యత్పతికావాదమునకు మూలమైనదీ క్రింది అమరుకశతకములోని శ్లోకము:

ప్రస్థానం వలయైః కృతం, ప్రియసఖై రస్రై రజస్రం గతం|
ధృత్యా న క్షణ మాసితం, వ్యవసితం చిత్తేన గన్తుం పురః||
యాతుం నిశ్చిత చేతసి ప్రియతమే సర్వే సమం ప్రస్థితం|
గన్తవ్యే సతి జీవిత! ప్రియసుహృత్సార్థః కిముత్సృజ్యతే||

దీనికి నాభావానువాదము:

చ. వలయము లూనె పైనము, నవారిగఁ బాఱుచుఁ బోవు నశ్రువుల్,
నిలువక పోవసాగె ధృతి, నిర్గతమయ్యెను మున్నె చిత్తమున్,
ౘలమున దూరయానమును సల్పెడువానినిఁ గూడి యిట్లు వా
రలు సనుచుండఁ జిక్కితివి ప్రాణమ! చేరక నీదుమిత్రులన్.

అర్థవివరణ: ప్రియుని ప్రవాసవార్తను విన్నంతనే ఆమె తనువు కృశించినది. ఆమె చేతియందలి కంకణములు జారిపోయినవి. కన్నీరు నిరంతరముగా (అజస్రం) కారిపోయినది. ధైర్యము క్షణమాత్రము నిల్వలేదు. వానికి ముందే మనస్సు పోయినది, అనగా మనోవేదన కలిగినది. ఆ వెళ్ళబోవుప్రియునితో అతనికి మిత్రములైనట్లుగా ఇవన్నియు బయలుదేరినవి. ఒక్క ప్రాణము మాత్రమే ఆమెలో మిగిలియున్నది. ఓప్రాణమా! నీవును నీకు మిత్రసమానులైన వారితో బోవక ఎందుకున్నావు? అని యామె ప్రశ్నించుచున్నది. ఈయవస్థ ప్రవాసవార్త విన్నంతనే కల్గుటవల్ల ఈ నాయిక ప్రవత్స్యత్పతికగా నుదాహరింపబడినది.

పుష్పబాణవిలాసములోని ఈక్రింది శ్లోకములోను నాయిక ప్రవాసోన్ముఖుడైన నాయకునితో కల్గబోవు విరహావస్థను తెల్పుచున్నది.

ఏతస్మిన్ సహసా వసన్తసమయే ప్రాణేశ దేశాన్తరం|
గన్తుం త్వం యతసే, తథాపి న భయం తాపాత్ ప్రపద్యేఽధునా||
యస్మాత్ కైరవసారసౌరభముషా సాకం సరోవాయునా|
చాన్ద్రీ దిక్షు విజృమ్భతే రజనిషు స్వచ్ఛామయూఖచ్ఛటా||

దీనికి నా భావానువాదము:

ఉ. ఈ ననకారునం దెటకొ యేఁగఁగనెంతు వతర్కితంబుగా
నైననుఁ బ్రాణనాథ! విరహాగ్నికి భీతిల నేను – చంద్రికా
నూనసుషీమయామినులు, నూతనకైరవగంధహర్తయై
పూని సరస్సుశైత్యమును పొందుగ వీఁచు సమీరుఁ డుండఁగన్.

వివరణ: వసంతకాలము వచ్చినది. అది ప్రేయసీప్రియుల కత్యంతోద్దీపనకారకము. అట్టి సమయములో ప్రియుడు దేశాంతరమున కేగ దలంచి నాడు. ఆమె అనుచున్నది: ‘ఓ ప్రాణనాథ! నీవనాలోచితముగా విదేశమేగుటకు నిశ్చయించినావు. కాని తజ్జనితమైన విరహతాపమునకు నేనేమీ భయపడను. ఏలనన పండువెన్నెలతో చల్లనైన రాత్రులు, ఆరాత్రులందు సరస్సులందు విరిసిన తెల్లకలువల గంధమును హరించి వీచు చల్లని మరుత్తులు ఉండనే యున్నవి.’

లోకమునందు తప్తమైన వస్తువునకు శీతలవస్తువు తాకిన తాపవినిమయమువల్ల తప్తవస్తువు చల్లబడుట స్వాభావికము. చల్లని వెన్నెల, శీతలసురభిళమారుతములు తాపోపశమనసమర్థములని, అందుచేత తనకు తాపభయము లేదని పైకి స్ఫురించు అర్థము. కాని అంతరార్థము దీనికి విపరీతమైనది. విరహతాప మొక వింతతాపము. శీతలచంద్రికావాతములు దానిని అతిశయింపజేయునే కాని అల్పమొనరింపవు. అందుచేత ఆమె మాటల కంతరార్థ మిట్లున్నది – ‘ప్రాణేశ=ప్రాణనాథ’ అను సంబోధనముచే, నీకధీనమైన నాప్రాణములు నీవు పోవ నీతోనే వెడలిపోవును. అందుచేత నిన్ను విడిచి నేనుండలే ననుచున్నది. ‘అస్మిన్ వసంతే = ఈ ననకారులో’ అని ఎత్తుకోవడంవల్ల ఈవసంతం అన్ని విధముల ప్రేమికుల కుద్దీపనకరము, అది నీవు గణింపక ‘సహసా = అతర్కితంబుగా=అనాలోచితముగా’ పోవుటకు నిశ్చయించితి వనుచున్నది. అన్యకార్యవ్యాసంగమున పగలు గడచినను, రాత్రు లొంటరిగ గడపుట దుర్భరమగును. నిండుపున్నమ రాత్రులు, ఆరాత్రులందు వీచు కైరవపరీమళభరితములైన శీతలవాయువులు విరహతాపము నధికము చేయును. అవి నీవు వెడలగనే విజృంభించి నా ప్రాణమునే తీసివేయును. ప్రాణ ముండినగదా తాపభయముండుట. అందుచేత నాకు తాపభయము లేదనుచున్నది. ప్రవాసవార్తాశ్రవణమాత్రము చేతనే విశ్లేషణాసౌఖ్యము ననుభవించుచున్నది కనుక ఈనాయిక ప్రవత్స్యత్పతిక. ఇట్టి నాయికకే అమరుకమునుండి మఱొక్క చక్కని ఉదాహరణము:

లగ్నా నాంశుకపల్లవే, భుజలతా న ద్వారదేశేఽర్పితా|
నో వా పాదయుగే స్వయం నిపతితం, తిష్ఠేతి నోక్తం వచః||
కాలే కేవలమమ్బుదాలిమలినే గన్తుం ప్రవృత్తః శఠ|
స్తన్వ్యా బాష్పజలౌఘకల్పితనదీ పూరేణ రుద్ధః ప్రియః||

దీనికి నా భావానువాదము:

ఉ. ద్వారము నడ్డుకోఁగ భుజవల్లులు సాఁచదు; కొంగు లాగఁగా
నేరదు; కాళ్లపైనిఁ బడనేరదు; పోవలదంచుఁ బల్కఁగా
నేరదు; కాని దాఁటి చన నేరని యశ్రునదిన్ గృశాంగి తాఁ
గారిచె మబ్బుచాల్పొడము కాలమునన్ విభుఁ డేఁగనెంచినన్.

వివరణ: వర్షాకాల మప్పుడప్పుడే ప్రవేశించుచున్నది. అందుచేత అది కేవలము ‘అంబుదాలిమలినకాలము =మేఘములనల్లదనము గల్గిన కాలము’గా నున్నది. అనగా మేఘము లేర్పడినవి గాని ఇంకను వర్షారంభము కాలేదని అర్థము. దీనిని నేను ‘మబ్బుచాల్ పొడముకాలము’ అన్నాను. వర్షాకాలమునందు ప్రియుని విరహము స్త్రీల కత్యంతక్లేశకారణ మగునని కవుల సంప్రదాయము. దీనినే కాళిదాసు మేఘసందేశములో ‘మేఘాలోకే భవతి సుఖినోఽప్యన్యథావృత్తి చేతః, కంఠాశ్లేషప్రణయినిజనే కిం పునర్దూరసంస్థే’ అన్నాడు. ఇట్టి సమయములో నాయకుడు దూరదేశ మేగుట కుద్యమించినాడు. ఇట్టి ప్రయత్నమును నివారించుటకు పోవలదని కొంగు బట్టి లాగుట, ద్వారమున కడ్డముగా చేతులు సాచి నిలబడి నిరోధించుట, కాళ్లపైబడి ప్రాధేయపడుట, ‘పోబోకు’మని పలుకుట సామాన్యముగ చేయు యత్నములు. కాని ప్రియుని ప్రవాసవార్త విన్నంతనే కృశాంగియైన ఆనాయిక యివేవియు చేయలేదు. మేఘమలినమాత్రమైన ఆకాలములో మేఘములు వర్షింప లేదు కాని ఆమె మాత్రము నిరంతరముగా అశ్రువుల వర్షించినది. ఆ అశ్రునదిని దాటలేక నాయకు డింటిలోనే చిక్కిపోయినాడు.

చింత, నిశ్శ్వాసము, ఖేదము, హృదయతాపము, సఖీసంలాపము, స్వీయావస్థాపర్యాలోచనము, గ్లాని, అశ్రుపాతము, భూషణత్యాగము, కేశసంస్కారరాహిత్యము, మాలిన్యము, రోదనము, చిత్తానవస్థితి – వీని నభినయించుటచే ప్రోషితభర్తృకావస్థను ప్రదర్శింపవలెనని భరతుడు తెల్పెను. కాళిదాసు మేఘసందేశములోని ఈక్రింది శ్లోకములో చింత, నిశ్శ్వాసము, రోదనము, కేశసంస్కారరాహిత్యము, మలినత్వములు గల ప్రోషితభర్తృక యైన యక్షిణి చెప్పబడినది:

నూనం తస్యాః ప్రబలరుదితోచ్ఛూననేత్రం ప్రియాయా|
నిశ్శ్వాసానా మశిశిరతయా భిన్నవర్ణాధరోష్ఠమ్||
హస్తన్యస్తం ముఖ మసకలవ్యక్తి లమ్బాలకత్వాత్|
ఇన్దో ర్దైన్యం త్వదనుసరణ క్లిష్టకాన్తే ర్బిభర్తి||

దీనికి నా భావానువాదము:

చ. అతితరరోదనంబున మదంగన కందొవ యుబ్బుసూప, నూ
ర్జితమగు వేఁడియూర్పుగమిచే నధరోష్ఠము కాంతి దప్ప, వి
శ్లథకచసంవృతంబు శయసక్తమునైన ముఖంబు నీవు గుం
ఠితమొనరించు నిందుగతి నించుక తోఁపఁగ నుండు దీనయై.

అర్థము: ప్రబలరుదిత = అధికమైన రోదనముచేత, ఉచ్ఛూననేత్రం= ఉబ్బిన కన్నులు గలదియు (ఇచ్చట విషాదజనితరోదనము చెప్పబడినది, అధికముగా ఏడ్చుటచేత కనులు వాచుట స్వాభావికము), నిశ్శ్వాసానామ్=నిశ్శ్వాసములయొక్క, అశిశిరతయా=వేఁడిమివల్ల, భిన్నవర్ణాధ రోష్ఠమ్=కాంతిచెడిన క్రిందిపెదవి గలదియు (ఇచ్చట నిశ్శ్వాసమను లక్షణము చెప్పబడినది. వేఁడియూర్పులు పెదవులపై ప్రసరించుటవల్ల పెదవులు కాంతి దొఱగుట సహజము), హస్తన్యస్తం =చేతియం దుంపబడినదియు, లమ్బాలకత్వాత్=(దువ్వుకొనమిచే) వ్రేలాడు ముంగురులు గలదియు నైన, అసకలవ్యక్తి=కొంతగానే కన్పడుచున్న, తస్యాః ప్రియాయాః ముఖమ్= ఆ ప్రియురాలి ముఖము (ఇచ్చట చింతా, మాలిన్యము అను లక్షణములు చెప్పబడినవి. అఱచేతిలో చెక్కిలి నుంచుకొని చింతించుట, అనాసక్తివల్ల కేశసంస్కారము లేకుండుటచే ముంగురులు ముఖముపై వ్రేలాడుచు ముఖము సాంతముగా గన్పడకుండుట, అందుచే మలినముగాఁ దోచుట సహజము), త్వదనుసరణక్లిష్టకాన్తేః = నీవు (అనగా మేఘుడు) అడ్డుపడుటవల్ల కాంతి దొఱగిన, ఇన్దోః=చంద్రునియొక్క, దైన్యమ్=దీనతను, బిభర్తి నూనం = పొందియుండునని తలచెదను. అనగా అలకలు ముఖముపై పడుటవల్ల పూర్తిగా కానరాని నాయికాముఖము మేఘముచే నడ్డుకొనబడిన చంద్రునివలె నున్న దనుట. ఈసందర్భము లోనిదే కాళిదాసుయొక్క మఱియొక శ్లోకము:

ఉత్సఙ్గే వా మలినవసనే సౌమ్య నిక్షిప్య వీణాం|
మద్గోత్రాఙ్కం విరచితపదం గేయ ముద్గాతుకామా||
తన్త్రీ మార్ద్రాం నయనసలిలైః సారయిత్వా కథంచిత్|
భూయోభూయః స్వయమపికృతాం మూర్ఛనాం విస్మరన్తీ||

దీనికి నా భావానువాదము:

చ. ధృతమలినాంశుకాంకమున నింతి విపంచిక నుంచి మామకాం
చితకులనామగానమును జేయఁగఁ బూనుచు నెట్లొయశ్రుసం
తతిపరిషిక్తతంత్రుల పునశ్శ్రుతి చేయును గాని, స్వీయక
ల్పితములె యైన మూర్ఛనల విస్మరియించుచునుండు మాటికిన్.

అర్థము: హే సౌమ్య=ఓసౌమ్యుడవైన మేఘుడా, (నాప్రియురాలు), మలినవసనే=మలినమైన వసనము గల, ఉత్సఙ్గే=ఒడియందు, వీణాం నిక్షిప్య= వీణ నుంచుకొని, మద్గోత్రాఙ్కం=నా గోత్రనామములతో, విరచితపదం గేయమ్ =రచింపబడిన పదములుగల పాటను, ఉద్గాతుకామా =ఉచ్చైస్స్వరముతో,అనగా దేవయోనులకు మాత్రమే పాడుటకు సాధ్యమైన గాంధారగ్రామములో పాడదలచినదై, నయనసలిలైః =(అట్లు నా స్మరణమువలన వెల్వడిన) కన్నీటితో, ఆర్ద్రాం తన్త్రీమ్ = తడిసిన వీణతీగెను, కథంచిత్=ఎట్లో (ప్రయాసమున), సారయిత్వా=(తుడిచి) శ్రుతి చేసి, స్వయమపికృతాం మూర్ఛనాం = తనచేతనే కల్పింపబడిన స్వరస్థానములను(మూర్ఛనలను), భూయోభూయః=మఱిమఱి, విస్మరన్తీ =మఱచుచున్నదై యుండును. అనగా విరహముచే గల్గిన అవ్యవస్థితచిత్తముచే గల్గిన అనవధానముచే తాను స్వయముగా గల్పించినవైనను ఆమూర్ఛనలను మాటిమాటికి మఱచుచు పాడుచుండుననుట. అశ్రుపాతముచే తడిసిన తంత్రులను మఱిమఱి శ్రుతి చేయ వలసివచ్చుటచే నదియు కష్టసాధ్యముగా నున్నదనుట. ఈశ్లోకములో స్మరణము, మాలిన్యము, చిత్తానవస్థితి, అనవధానత అను ప్రోషితభర్తృకాలక్షణములు చెప్పబడినవి. మేఘసందేశములో నీసందర్భములో యక్షిణియొక్క కృశతను, జాగరణను, ఇష్టవస్తునిరాసమును, నిమిత్త పర్యాలోకనాదులను వ్యక్తీకరించు మఱికొన్ని శ్లోకము లున్నవి. ఆసక్తి గలవారు వీనిని పరిశీలింపవచ్చును. విస్తరణభీతిచే నేనిక్కడ వానిని వివరించుట లేదు.

పెద్దనగారి మనుచరిత్రములో వరూథిని ప్రవరాఖ్యునియందు మోహము వహించినది. కాని ఆతడామెను నిరాకరించి అగ్నిదేవుని ప్రార్థించి స్వస్థానమున కేగినాడు. ఐనను అతనియం దనురక్తి ఆమెకు నిశింపలేదు సరికదా ఆమె ప్రోషితభర్తృకవలె విరహము ననుభవించినది. అంతేకాక ఆమె సహచారిణులైన రంభాద్యప్సరసలు ‘విప్రవరుండు గోలయున్ బాలుఁడు గాన నప్పటికిఁ బైఁబడఁ గొంకెనుగాని వానికిన్ గాలొకచోట నిల్చునె వగన్ మగుడన్ నినుఁ జూచునంతకున్’ అని ఆమెను బుజ్జగించి ప్రవరపునర్దర్శనాశ నామె మనమందు పచ్చగనే యుంచినారు. ఇట్టి విరహావస్థ ననుభవించు నామెకు చిత్తానవస్థితి, ఇష్టవస్తువులయం దనాదరము, తూష్ణీంభావము కల్గినది. దాని నీక్రింది పద్యములో పెద్దనగారు చక్కగా వర్ణించినారు.

సీ. ఘనసారపంక మొక్కలతాంగి దెచ్చిన
ముట్టి వ్రేలనె చుక్కబొట్టు వెట్టి,
యింతి యొక్కతె పూవుటెత్తు లెత్తినఁ జూచి
విసువుతో నొకకొన్ని విరులు దుఱిమి,
పడఁతి యొక్కతె రత్నపాదుక లిడ నిల్చి
తొడుగ కవ్వలికిఁ బోనడుగు వెట్టి,
బాగాలు వెస నొక్క పద్మాక్షి యొసఁగిన
వెగ్గలం బని కొన్ని వెడల నుమిసి,

తే. సగము గొఱికినయాకును, సఖులు పిలువ
సగమొసఁగు నుత్తరముఁ, దెల్వి సగము మఱపు
సగము నయి, చింతచే సగ మగుచు నరిగె
నవ్వరూథిని యంతికోద్యానమునకు.

(ఘనసారపంకము=కర్పూరపుగంధము; పూవుటెత్తులు=పూలదొంతులు; బాగాలు=కత్తిరించిన పోకలు)

శ్రీమతి చర్ల రత్నశాస్త్రిగారు పాడిన మత్కృతమైన ‘చెలియరో యిది యేమె చేతి మురువులు జారె’ అను ఈ పాట ప్రోషితభర్తృక యైన నాయికావిరహావస్థను ప్రకటించునది.

చెలియరో యిది యేమె (చక్రవాకరాగం)
పల్లవి:
చెలియరో యిది యేమె చేతిమురువులు జారె
ఎడలేక కన్నీరు ఏఱులై పారె
అ.పల్లవి:
సరసుండు వల్లభుడు సద్వర్తనుండు
నను బాసి పరదేశమున కేగు నన్నంత |చెలియరో|
చరణం 1:
నామాటనే యెంచి పూమూటగా నెపుడు
నాపనుపునే పూని నవమాలగా నెపుడు
నాకు ప్రియమును జేయు నాథుడే యెటకొ
చనునన్న వార్తయే శ్రవణాల సోకంగ |చెలియరో|
చరణం 2:
కొలనులో నీదుచు జలకేళి సల్పుచు
వనములం గుసుమాళి పరువంబు మెచ్చుచు
కడలిలో కెరటాల గమనంబు గాంచుచు
విహరింప నాతోడ వేరెవరు రాగలరు? |చెలియరో|
చరణం 3:
తాళగల నేరీతి ధవుని యెడబాటు
తోడులేక కృశించు పాడుకాలము వచ్చె
ఇంతతెలిసినగాని అంతమొందకయుంటి
ఎంతతీపియొకదా ఈపాడు ప్రాణంబు |చెలియరో|

ఖండిత, కలహాంతరిత
రచన: తిరుమల కృష్ణదేశికాచార్యులు మే 2016
కావ్యరసములలో శృంగారమును రసరాజముగా లాక్షణికు లంగీకరించియుండుట సర్వజనవిదితమే. ఇట్టి శృంగారరసమునకు ఆలంబనములు నాయికానాయకులు.

నాయికానాయకుల యొక్క చక్షుష్ప్రీతి, మనస్సంగములవల్ల కలుగు మనోవికారమే రూఢమై శృంగారరసముగా పరిణమించును. దీనికి పరిసరములందలి సురభిళానిల సుందరోద్యాన చంద్రికాదిసన్నివేశములును, పరస్పరాభిహితమైన ఆహార్యాంగహార చేష్టాదులును ఉద్దీపకములుగా లాక్షణికులు గుర్తించినారు. ఇవన్నియు అనురక్తులైన నాయికానాయకుల అనుభవమం దున్నవే. వీనినే లాక్షణికులు సిద్ధాంతీకరించినారు. నాయికావిషయప్రసక్తిలో ఆసక్తికరమైన విషయము అష్టవిధశృంగార నాయికావర్గీకరణము. ఇది నాయికా తాత్కాలిక మనోధర్మ వర్గీకరణమే కాని, నాయికాప్రకృతి వర్గీకరణము కాదు. అనగా ఒకే నాయిక తత్తత్కాలమనోధర్మము ననుసరించి, ఈ అష్టవర్గములలో ఏదో యొక వర్గమునకు చెంది యుండుననుట. కావ్యాలంకారసంగ్రహములో ఈ శృంగారనాయికల లక్షణము లిట్లు చెప్పబడినవి:

సీ.వరుఁడు కైవసమైన వనిత స్వాధీనభ
ర్తృక; ప్రియాగమవేళ గృహముఁ,దనువు
సవరించు నింతి వాసకసజ్జ; పతిరాక
తడవుండ నుత్కంఠఁ దాల్చునింతి
విరహోత్క; సంకేత మరసి, నాథుఁడు లేమి
వెస నార్తయౌ కాంత విప్రలబ్ధ;
విభుఁడన్యసతిఁ బొంది వేఁకువ రాఁ గుందు
నబల ఖండిత; యల్క నధిపుఁ దెగడి

గీ. అనుశయముఁ జెందు సతి కలహాంతరిత; ని
జేశుఁడు విదేశగతుఁడైనఁ గృశతఁ దాల్చు
నతివ ప్రోషితపతిక; కాంతాభిసరణ
శీల యభిసారికాఖ్యయై చెలువు మెఱయు.

(అర్థము సులభము; అనుశయము=పశ్చాత్తాపము)

పై పద్యములో ఈ అష్టవిధనాయికల పేర్లు సాంద్రాక్షరములతో గుర్తింపబడినవి. మార్చినెల యందలి ఈమాటలో వాసకసజ్జికా, విరహోత్కంఠితా లక్షణములను గుఱించి కొంత వివరించినాను. ఇప్పుడు ఖండిత, కలహాంతరిత నాయికలనుగుఱించి వివరించి, వారి మనోధర్మములను ప్రతిబింబించునట్లుగా నేను వ్రాసిన గీతమును శ్రవ్యమాధ్యమములో ప్రదర్శింతును. ఇదియే ఈ వ్యాసము యొక్క ఆశయము.

ఖండిత
నీత్వాఽన్యత్ర నిశాం ప్రాతరాగతే ప్రాణవల్లభే|
అన్యాసంభోగచిహ్నై స్తు కుపితా ఖండితా మతా||

అని విద్యానాథుని ప్రతాపరుద్రీయములో ఖండిత నిర్వచనము. ‘రాత్రియంతయు అన్యకాంతతో గడిపి, ప్రొద్దున తత్సంభోగచిహ్నములతో వచ్చిన నాయకునిపట్ల కుపితయైన నాయిక ఖండిత’ అని దీని కర్థము. ప్రతాపరుద్రీయమునే అనుసరించిన రామరాజభూషణుని ‘విభుఁడన్య సతిఁ బొంది వేఁకువ రాఁ గుందు నబల ఖండిత’ అను నిర్వచనము దీనికి దాదాపుగా సరిపోవుచున్నది. కాని ఈ నిర్వచనములో నాయకుని యొక్క అన్యస్త్రీసంగమచిహ్నముల ప్రసక్తి లేదు. చిహ్నములు లేకున్నను ప్రియుడు అన్యకాంతాసంగము చేసి వచ్చినాడని శంకించి కోపగించిన నాయికయు ఖండితయే యగుచున్నది. అన్యకాంతాసంగము జరిగినదను అనుమానమే ఈనాయికయొక్క రోషదైన్యాదులకు కారణము.

అన్యవ్యాపకముల వల్ల నాయకుడు రాకున్నచో మనోవైకల్యమును జెందునది విరహోత్కంఠిత. ఈవిధముగా ఖండిత యొక్కయు, విరహోత్కంఠిత యొక్కయు మనఃస్థితులకు కారణమైన పరిస్థితులకు స్పష్టమైన భేదమున్నది. అందుచే వీరు వేర్వేరు నాయికలుగా గుర్తింపబడినారు. సాపరాధుడైన నాయకుని దేహమునందలి పరకాంతాసంగమసంకేతములను పరిశీలించి, చింత, నిశ్శ్వాసము, ఖేదము, సఖీసంలాపము, గ్లాని, దైన్యము, అశ్రుపాతము, రోషము, భూషణత్యాగము, రోదనాదులతో ఖండితానాయిక తన యవస్థ నభినయించవలెనని భరతుడు తెల్పినాడు. రసార్ణవసుధాకరములోని ఈక్రింది శ్లోకము ఇట్టి ఖండితానాయికయొక్క చేష్టలను చక్కగా వర్ణించుచున్నది.

ప్రభాతే ప్రాణేశం నవమదనముద్రాంకితతనుం
వధూర్దృష్ట్వా రోషాత్ కిమపి కుటిలం జల్పతి ముహుః|
ముహుర్ధత్తే చిన్తాం ముహురపి పరిభ్రామ్యతి ముహు
ర్విధత్తే నిఃశ్వాసం ముహురపిచ బాష్పం విసృజతి||

తాత్పర్యము: ప్రభాతమునందు ప్రాణేశునియొక్క నవమదనముద్రాంకితమైన తనువును చూచి, అతని కాంత రోషంతో మాటికి ఏవో కుటిలమైన (ఎత్తిపొడుపు) మాటలు వల్లించును. మఱిమఱి చింత వహించును. మఱిమఱి నిలుకడ లేక చలించును, నిఃశ్వాసములు వెడలించును, కన్నీటిని గార్చును. ఇట్లు కాంతుని ప్రవర్తనపట్ల కాంతలో గలిగిన సంక్షోభము నామె చేష్టలు ప్రవ్యక్తమొనర్చినవి.

వసుచరిత్రం లోని ఈక్రింది పద్యంలో రామరాజభూషణుడు బహురమ్యంగా తుమ్మెద తనువందు పద్మినీసంగమచిహ్నము లున్నట్లు వర్ణించినాడు.

ఉ. తుమ్మెద త్రిమ్మరీఁడు పయిఁదోఁచుపిశంగిమ పద్మినీనిశాం
కమ్మది తాఁ బరాగపటిఁ గప్పి మధువ్రతిఁ జేరఁబోవుచున్
నమ్మిక కంగజప్రహరణమ్ముల ముట్టెడుఁ జూడవమ్మ ప
ల్గొమ్మలఁ జెందువారలు తగు ల్విరియాటలు నేర కుందురే.

తాత్పర్యము: తుమ్మెద యను త్రిమ్మరి మధువ్రతిని (ఆడతుమ్మెదను) జేరబోవుచు, తన శరీరమునందలి నిశాంకమైన (రాత్రి పద్మినిని గూడియున్నందువలన మేనికంటిన) పసుపుపచ్చని మరకను (తెల్లని) పరాగమను వస్త్రముతో గప్పి, తాను రాత్రియందు పద్మినీసంగము చేయలేదని మధువ్రతికి నమ్మిక కల్గునట్లు మన్మథాయుధములను ముట్టుకొనుచున్నాడు. మఱి పలుకొమ్మలను (అనేకస్త్రీలను, అనేకతరు శాఖలను) పొందువారు తగులములు (ఆసక్తులు), విరియాటలు (పుష్పక్రీడలు, స్వేచ్ఛావిహారములు) నేర్వకుందురా? – నేర్తురుగదా యని కాకువు.

వివరణ: తుమ్మెదలు రాత్రియందు ముకుళించు పద్మములయందు జిక్కుకొని పగ లాపద్మములు విచ్చికొనగానే బయల్వెడునని వర్ణించుట కవుల సంప్రదాయము. అట్లు (తుమ్మెద యను నాయకుడు) పద్మినితో (అనగా పద్మలతయను పద్మినీజాతిస్త్రీతో) రాత్రియంతయు గడపుటచేత ఆనాయకునిమేనికి నిశాంకము పచ్చగా నంటినది. ఇచ్చట నిశాంక మనగా రాత్రికేళీపరమైన చిహ్నము.
‘నిశాఖ్యా కాంచనీ పీతా హరిద్రా వరవర్ణినీ’ అని యుండుటచేత నిశాశబ్దమునకు పసుపనియు అర్థము. అందుచే ఆపద్మినీజాతిస్త్రీ శరీరమున లేపనము చేసికొన్న పసుపు ఆమెతో రాత్రి క్రీడించుటచే నాయకున కంటుకొన్నదని అర్థము. రాత్రిపూట పద్మములో జిక్కుకొనుటచే పద్మపరాగము తుమ్మెదమేనికి పచ్చగా పసుపుమరకవలె అంటుకొన్నదని స్వాభావికార్థము. అట్టి పరస్త్రీసంగమచిహ్నమును (తెల్లని) పరాగమను వస్త్రముతో గప్పివైచి, పైగా దానేమి తప్పును చేయలేదని నమ్మకము కల్గించుటకై మన్మథాస్త్రములను ముట్టుకొని ఒట్టును పెట్టుకొనుచున్నాడీ మగతుమ్మెద యను ధృష్టనాయకుడు. మన్మథాస్త్రములన పువ్వులు. మన్మథునికి అస్త్రములు పువ్వులే కదా! పద్మములలో నుండి వెల్వడిన తుమ్మెద లితరపుష్పముల పరాగమును ధరించుట, ఇతరపుష్పములను స్పృశించుట స్వాభావికమేకదా! ఇట్లీ ప్రశస్తమైన పద్యములో ఖండితానాయికకు కోపకారణమైన నాయకుని యొక్క పరకాంతాసంగమచిహ్నములు చక్కగా వర్ణింపబడినవి. కపటియైన నాయకుడా చిహ్నములను గప్పిపుచ్చి తాను నిర్దోషినని మన్మథప్రహరణములను ముట్టుకొని ఒట్టుపెట్టుకొని ఆమెను నమ్మించి, ప్రమాదమును తప్పించుకొనినాడు.

రాత్రిర్యామత్రయపరిమితా, వల్లభాస్తే సహస్రం
మార్గాసక్త్యా మమ గృహమపి ప్రాత రేవాగతోసి|
కిం కర్తవ్యం? వద! నృపతిభిః వీక్షణీయా హి సర్వాః
కోవా దోషస్తవ? పునరహం కామ మాయాసయిత్రీ||

పై శ్లోకము ఖండితాలక్షణమునకు ప్రతాపరుద్రీయములో విద్యానాథు డిచ్చిన చక్కని ఉదాహరణము. దీనికి శ్రీమాన్ చలమచర్ల రంగాచార్యుల వారి అనువాద మీక్రింది పద్యము:

మ. సరిగా జాములు మూఁడు రేయికిఁ; బ్రియాసంఘంబ వేయింటి కౌ,
వఱువాతన్ నృప! దారిఁబోవుచు నిటుల్ వైళంబ విచ్చేసితే?
నరపాలుర్ దమ, రందఱం గనుఁగొనన్ న్యాయ్యంబెగా! యేమనన్?
మఱి మీదోసము లేదు లెండు, మిగులన్ బాధించు నాదోసమే!

రాత్రి యంతయు అన్యకాంతతో గడపి, ప్రొద్దున సంభోగచిహ్నములతో నిలు చేరిన ప్రభువును జూచి ఖండితానాయిక వక్రోక్తిగా ననుచున్నది: రాత్రియో మూడుజాములు మాత్రమే. తమరికో ప్రియాసంఘము వేయింటి కున్నది. ఏదో తెల్లవాఱి (రాత్రి కాదని భావము) దారిని బోవుచు (అనైచ్ఛికముగా ననుట) ఈయింటిలో దూరితిరి. తాము ప్రభువులు (సరసులు గారనుట). మీకందఱు సమానులే (గుణదోషవిచక్షణ లేదనుట). అందఱిని చూడవలసినవారే. మీకింతటి బాధను (ప్రయాసను) కలిగించుట నాదే దోషము. మీదోష మిసుమంతయు లేదు.

ఇటువంటి వక్రోక్తి (వ్యాజస్తుతి) గలదే పుష్పబాణవిలాసం లోని అందమైన ఈక్రింది శ్లోకము.

సత్యం తద్యదవోచథా మమ మహాన్ రాగ స్త్వదీయాదితి
త్వం ప్రాప్తోఽసి విభాత ఏవ సదనం మాం ద్రష్టుకామో యతః|
రాగం కించ బిభర్షి నాథ హృదయే కాశ్మీరపత్త్రోదితం
నేత్రే జాగరజం లలాటఫలకే లాక్షారసాపాదితమ్.||

వివరణ: నాయకుడు రాత్రి అన్యకాంతతో గడిపి, వేకువన తనకాంత కడకు వచ్చినాడు. అతనిని జూచి, వ్యాజస్తుతితో ఆనాయిక ఇట్లు ఉపాలంభించుచున్నది. నాథ=ప్రియుడా! త్వదీయాత్=నీకంటె, మమ రాగః మహాన్ ఇతి= నా రాగము అధికమైనదని, యత్=ఏది, అవోచథాః= పలికితివో, తత్=అది, సత్యం=సత్యమే; యతః=ఎందుచేత ననగా, మాం=నన్ను, ద్రష్టుకామః =చూడగోరినవాడవై, త్వం=నీవు, విభాత ఏవ = పెందలకడనే (రాత్రి రాలేదనుట), ప్రాప్తోఽసి=వచ్చితివి; కించ=మఱియు, హృదయే=ఎదయందు, కాశ్మీరపత్త్రోదితం= కుంకుమ పత్త్రభంగజనితమైనట్టిదియు, నేత్రే జాగరజం= కనులయందు జాగరణచే గల్గినదియు, లలాటఫలకే=నొసటియందు, లక్షారసాపాదితం= లాక్షా రసముచే గల్గినదియు నగు, రాగం=రాగమును , బిభర్షి=ధరించియున్నావు.

తాత్పర్యము: ఓ నాయకుడా! నాకు మనసులో మాత్రమే నీపై రాగమున్నది. మఱి నీకో శరీరమందంతటను రాగమున్నది. నీయెదలో కశ్మీరపత్ర రాగ మున్నది; కనులలో జాగరణరాగ మున్నది; నొసటిపై లాక్షారసరాగ మున్నది. నాపై ఎంత మక్కువయో, నాకడకు పెందలకడనే వచ్చితివి (రాత్రి రాలేదనుట). నీవు వచించినట్లు నీకు నాయందు గల రాగాతిశయ మధికమైన దనుటలో అసత్య మింతయు లేదు. ఇచ్చట రాగ మనగా అనురాగమనియు, ఎఱ్ఱదనమనియు గ్రహింపవలెను. ‘నాకు మనసులో మాత్రమే రాగమనగా అనురాగ మున్నది. నీకో శరీర మంతటను రాగము (అనగా అన్యకాంతాసంభోగచిహ్నమైన ఎఱ్ఱదనము) ఉన్నది’ అని వ్యాజస్తుతిచే నాయిక నాయకుని ఉపాలంభించుచున్నది.

న బరీభరీతి కబరీభరే స్రజో, న చరీకరీతి మృగనాభిచిత్రకమ్|
విజరీహరీతి న పురేవ మత్పురో, వివరీవరీతి న చ విప్రియం ప్రియా||

అందమైన ఈశ్లోకం పుష్పబాణవిలాసంలోనిది. నాయకుని అన్యకాంతాసంగమచిహ్నములను గాంచి ఒక ఖండితానాయిక ఈర్ష్యామానములు వహించినది. అతనివైపు చూచుట లేదు, అతనితో మాటాడుట లేదు. అతని కామె నెట్లు ప్రసన్నురాలిని చేసికొనవలెనో తోచుట లేదు. ఆతడామె చెలికత్తెతో నిట్లనుచున్నాడు: ప్రియా=ప్రియురాలు, పురా ఇవ=ముందువలె, కబరీభరే=గొప్పనైన కొప్పునందు, స్రజః=పూదండను, న బరీభరీతి=మఱిమఱి తుఱుముకొనదు; మృగనాభిచిత్రకమ్=కస్తూరితిలకమును, న చరీకరోతి= మఱిమఱి (సవరించి) పెట్టుకొనదు; మత్పురః=నాయెదుట, న విజరీహరీతి=తరచుగా (మఱిమఱి) చరింపదు; విప్రియం=(నా)తప్పిదమును, న వివరీవరీతి చ= (మఱిమఱి యడిగినను) చెప్పదు గూడ.
ఓ చెలీ! ఈమె వైఖరి నీకు దెలిసియున్న చెప్పుము.

అలంకారశాస్త్రప్రకారము ఈనాయిక మధ్యా-ధీరా అను కోవకు చెందినది. ‘మధ్యా ధీరా ప్రియం మానే న పశ్యతి న భాషతే’ –
‘మధ్యా ధీర మానము (ప్రణయకోపమును) వహించినప్పుడు ప్రియునివైపు చూడదు, మాటాడదు’ – అని ఆమె లక్షణము. పైశ్లోకములో అపరాధియైన నాయకునిపట్ల ఇట్టి (ఖండిత)నాయిక చేయు విపరీతవర్తనము వర్ణింపబడినది. ఇందులో గల ‘బరీభరీతి’, ‘చరీకరీతి’ ఇత్యాది పౌనఃపున్యార్థ కములైన యఙ్లుగంతరూపములు ఈశ్లోకమునకు అధికమైన అందము నొసగుచున్నవి.

ఖండితానాయికకు కావ్యాదులనుండి ఎన్నియో చక్కని ఉదాహరణ లీయవచ్చును. ఉదాహరణకు పారిజాతాపహరణకావ్యములోని ప్రథమాశ్వాసములో సత్యభామను చక్కని ఖండితానాయికగా ముక్కుతిమ్మన నిరూపించినాడు. రుక్మిణియందలి అనురాగముచే తనను కించపఱచినాడని సత్యభామ ఈర్ష్యాపరిపూర్ణమానసయై అట్లు చేసినది. రుక్మిణిసిగలో పారిజాతమును తుఱిమినపుడు శ్రీకృష్ణునిమేనిలో నెలకొన్న ‘పారిజాతకుసుమాగతనూతనదివ్యవాసనల్’ అతని అన్యకాంతానురక్తిని పట్టియిచ్చు చిహ్నములైనవి. ఇవి ఆమె ఈర్ష్యాకోపముల నినుమడింప జేసినవి. ‘వేఁడినిట్టూర్పులు దళంబుగా నిగిడినవి’.
‘మానసంబున నెలకొన్న క్రోధరసము న్వడిఁగట్టుచునున్నకైవడిన్’ స్తనతటమందలి కుంకుమపత్రభంగములు చెమటచే కరఁగి వెలిపట్టుపయ్యెద తడిసి ఎఱ్ఱవారినది. ఆమె శ్రీకృష్ణుని శిరస్సును తన్నుటయే గాక అతని ననేకవిధముల సూటిపోటిమాటలతో తూలనాడినది. చివరికి ‘ఈసునఁ బుట్టి డెందమున హెచ్చిన శోకదవానలంబుచే గాసిలి’, ‘పంకజశ్రీ సఖమైన మోముపయిఁ జేలచెఱంగిడి బాలపల్లవగ్రాసకషాయకంఠకలకంఠవధూకలకాకలీధ్వని’తో నేడ్చినది. ఈమానసికలక్షణములు, చేష్టలన్నియు అలంకారశాస్త్రములో లాక్షణికులు ఖండిత కాపాదించినవే. ఇట్లు ఖండితయొక్క పరిపూర్ణస్వరూపమును ముక్కుతిమ్మన సత్యభామయందు చూడనగును.

కలహాంతరిత
ఈర్యాకలహనిష్క్రాన్తో యస్యా నాగచ్ఛతి ప్రియః|
సామర్షవశసంప్రాప్తా కలహాన్తరితా భవేత్||

అని నాట్యశాస్త్రములో కలహాన్తరితాలక్షణము గలదు. ‘అల్క నధిపుఁ దెగడి అనుశయముఁ జెందు సతి కలహాంతరిత’ యను నిర్వచనము దీనికి సమముగానే యున్నది. ‘కలహేన అంతరితా వ్యవహితా అర్థాత్ ప్రాణనాథతః’ – ‘కలహమువల్ల వల్లభునితో ఎడయైనది’ అని కలహాంతరితా శబ్దమునకు వ్యుత్పత్తి. ఈకలహము రోషము, ఈర్ష్య, అసహనములచేత కలుగవలెను. ఇట్టి మనఃస్థితి అన్యకాంతానురక్తుడైన నాయకుని విషయమున గలుగుట సహజము. అట్టి కాంత ఖండిత యగును. అట్లు తనచే నుపాలంభింపబడి దూరమైన నాయకునిగూర్చి చింతించుచు, తనచర్యకు పశ్చాత్తాపము నొందు నాయిక కలహాంతరిత యగును. ఇట్లు ఖండితకు, కలహాంతరితకు స్వాభావికమైన పారంపర్యము గలదు. అమరుకశతకంలోని ఈ క్రింది శ్లోకము ‘కలహాంతరిత’కు చక్కని ఉదాహరణము.

చరణపతన ప్రత్యాఖ్యాన ప్రసాద పరాఙ్ముఖే
నిభృతకితవాచారేత్యుక్తే రుషాపరుషీకృతే|
వ్రజతి రమణే నిఃశ్వస్యోచ్చైః స్తనార్పితహస్తయా
నయనసలిలచ్ఛన్నా దృష్టిస్సఖీషు నిపాతితా||

అర్థవివరణము: నాయకునియందు పరస్త్రీసంభోగచిహ్నములు బయల్పడుటచే ఆమె కృద్ధురాలైనది. ఆమె కోపము నుపశమింపజేయుటకై ఆమె చెలుల సమక్షములో నాయకు డామె పాదములపై బడినాడు (ముక్కుతిమ్మన శ్రీకృష్ణుడును ఇట్లే చేసినాడు). ఐనను ఆమె అతనియందు విముఖురాలైనది. పైగా ‘నిభృతకితవాచారా =(సిసలైన మోసగాడా)’ అని అతనిని (చెలుల యెదుట) పరుషముగా నిందించినది. అతడు (రోషముతో) వెడలిపోసాగినాడు. ఆతని నివారించుట కామె మాన మడ్డము వచ్చినది. అంతలో తన చేష్టల కామెకు కొంత పశ్చాత్తాపము కల్గినది. అప్పుడామె స్తనతటమం దుంచిన హస్తముతో, బిగ్గరగా (దీనయై) నిట్టూర్చుచు, ఆశ్రుచ్ఛన్నములైన నేత్రములను (మీరైన ఆతనిని మఱలింపలేరా అను భావముతో) చెలులపై నిల్పినది. కోపముతో నిందింపబడిన నాయకుడు , తనను విడిచిపోగా తన చేష్టలకు పశ్చాత్తాపము నొందు నాయిక యిందు వర్ణింపబడినది.

రామరాజభూషణుని కావ్యాలంకారసంగ్రహములోని క్రింది యుదాహరణముసైతము రమ్యముగా నున్నది.

ఉ. ఆనఁగరాని కోపమున నప్పుడు కాంతుని ధిక్కరించుచో
మానదురాగ్రహగ్రహము మానుపలేకపు డెందుఁ బోయెనో
యా ననవింటిదంట యిపు డేఁపఁదొడంగె; భవిష్యదర్థముల్
గానని నా మనంబునకుఁ గావలె నిట్టి విషాదవేదనల్.

తాత్పర్యము: ఈర్ష్యాకోపముల బట్టలేక ఒకకాంత నాయకుని దూఱినది, తిరస్కరించినది. అతడామెకు దూరమైనాడు. వల్లమాలిన మానము, దురాగ్రహములనెడు భూతము తనను సోకినప్పుడు వానిని నివారింపలేని మన్మథుఁడు తననిప్పుడు సోకి బాధించుచున్నాడు. ముందుచూపు లేక యట్లు ప్రవర్తించిన తన మనసున కిట్టి దుఃఖము, ప్రయాస కల్గవలసినదే యని ఆకాంత పశ్చాత్తప్తురా లైనది.

ఇటువంటి మానసికస్థితిని ప్రతిబింబించునదే ఈక్రింది భానుదత్తుని ‘రసమంజరి’లోని శ్లోకము:

అకరోః కిము నేత్ర! శోణిమానం?
కిమకార్షీః కర! పద్మతర్జనం వా?
కలహం కిమధా ముధా? రసజ్ఞే!
హితమర్థం న విన్దతి దైవదృష్టాః!

దీనికి నా భావానువాదము:

తే. పూనితేల నేత్రంబ! ప్రశోణిమంబు?
జగడమాడితి వేల రసజ్ఞ! వృథగ?
కేలుదమ్మిచే వెఱపించితేల? కరమ!
మిమ్మనఁగ నేల? నాభాగ్య మిట్లు గ్రాల!

వివరణ: ఒక ఖండితానాయిక కాంతుని నిందించినది. అతఁడు పాదగ్రస్తుఁడై ఆమెను అనునయింప యత్నించినాడు. ఐనను మానవతియైన ఆమె ప్రసన్నురాలు కాలేదు. ఇంకను కనులెఱ్ఱచేసి అతనిపై కోపగించినది. నిష్ఠురము లాడి కలహించినది. హస్తమందలి లీలాపద్మమును ౙళిపించి ఆతని వెఱపించినది. ఆతడామెను వీడి పోయినాడు. కొంతసేపటి కామె మానము వీగిపోయినది. కలహాంతరితయైన ఆమె తన కాత్మీయమైన నేత్రజిహ్వాహస్తములే వైరులవలె నట్లు చేసినవని వానిని నిందించినది. కాని అట్లు వాని ననుట వ్యర్థమనుకొన్నది. తన దౌర్భాగ్యముచే నట్లు జరిగినదని విధినే దూషించుచు పశ్చాత్తాపము నొందినది. ఇట్టి చేష్టావిశేషములవల్ల ఆనాయిక ప్రౌఢ యని తేలుచున్నది. చివరిగా రసభావానుకూలముగా టొరంటోలోని శ్రీమతి చర్ల రత్నశాస్త్రిగారు పాడిన మత్కృతమైన యీక్రిందిపాటలో, అన్యకాంతా సంభోగచిహ్నముల గాంచి కాంతుని దూషించిన ఖండితానాయిక, కలహాంతరితయై పశ్చాత్తాపముతో వానిని ప్రసన్నుని జేసికొని రమ్మని సరసురాలైన తన సఖిని వేడికొనుట ఇతివృత్తముగా నున్నది:

పల్లవి:
ఏమి సేతునె చెలియ! ఇంకేమి సేతునే
విభుని దూరము సేసి, విరహంబు పాలైతి
అ.పల్లవి:
తగవులాడితి చాల, తాకంగ వలదంటి
మునుపుగూడినదాని పొంతకే పొమ్మంటి |ఏమి సేతునె|
చరణం 1:
వాని తనువున దాని వలపుగుర్తులు గంటి
గండమందున దానికంటికాటుక గంటి
కనులయందున జాగరణ చిన్నెలను గంటి
నన్ను దాకకు, దాని సన్నిధికె పొమ్మంటి |ఏమి సేతునె|
చరణం 2:
బాలనని నన్నింత వంచింతువా యంటి
చాలులే మురిపాలు సరసాలు పొమ్మంటి
అంటి నే గాని యిటులొంటరిని ననుజేసి
స్మరువింటి కెరసేసి చనడేమొ యనుకొంటి |ఏమి సేతునె|
చరణం 3:
సరసురాలవు నీవు, చతురవూ నీవు
త్వరతోడ జని వాని తిరిగి రమ్మనవె
తాళుకొంటిని వాని తప్పిదం బనవె
బాళితో నలరింతు పంతమేలనవె |ఏమి సేతునె|

______________________________________
అంకము జేరి శైలతనయా స్తనదుగ్ధములాను వేళ బా
ల్యాంక విచేష్ట దొండమున నవ్వలి చన్ గబళింపబోయి యా
వంక గుచంబు గాన కహి వల్లభ హారము గాంచి వే మృణా
ళాంకుర శంక నంటెడి గజాస్యుని గొల్తు నభీష్ట సిద్ధికిన్!

చివరి పాదంలో మొదటి అక్షరం “న”. యతిస్థానంలోని అక్షరం “భ”. ఈ రెండు హల్లులకీ యతి చెల్లదు. కానీ, “భ”ముందు పదం “నొసగున్”లో “న్” ఉంది కాబట్టి, దానికి “న”తో యతి చెల్లుతుంది. యతిస్థానంలో సంధి జారిగినప్పుడు, సాధారణంగా సంధి జరగకముందు ఉన్న అక్షరంతోనే యతిమైత్రి జరుగుతుంది. ఉదాహరణకు, ఈ కింద పద్యంలో రెండు, నాలుగు పాదాలు గమనించండి:

“బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులగు త్రిమూర్తులకు జన్మనిచ్చింది ఆది పరాశక్తి అగు శ్రీ రాజరాజేశ్వరీ దేవి. అప్పుడు రాజరాజేశ్వరీ దేవికి మూడవ నేత్రం ఉండేది. అనంతరం, తనను ఈ ముగ్గురిలో ఎవరో ఒకరు వివాహ మాడ వలసిందిగా కోరింది. మొదట ముగ్గురూ నిరాకరించారు. ఆమె నచ్చచెప్పిన పిమ్మట, శివుడు తనని వివాహమాడేందుకు అంగీకరించి, ఒక షరతు పెట్టాడు. తనను (ఆది పరాశక్తిని) వివాహమాడిన అనంతరం మూడవ నేత్రం శివునికి ఇవ్వాలి. అందుకు ఆ దేవత అంగీకరించి, వివాహానంతరం శివునికి మూడవ నేత్రమును ఇచ్చింది. అప్పుడు శివుడు ఆ మూడవ నేత్రముతో ఆ దేవతను భస్మం చేసిసి, ఆ భస్మరాశిని మూడు భాగాలుగా విభజించి, లక్ష్మి, సరస్వతి, పార్వతిలను సృష్టించాడు.”

Share on facebook
Share on twitter
Share on pinterest
Share on whatsapp
Share on email